టెర్రరిజం వదిలేవరకు పాకిస్థాన్ ను వదలం : త్రివిధ దళాలు

టెర్రరిజం వదిలేవరకు పాకిస్థాన్ ను వదలం : త్రివిధ దళాలు

ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో ఈ సాయంత్రం త్రివిధ దళాల ముఖ్య అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో చర్చించిన అంశాలను ఆర్మీ, నేవీ, వైమానిక దళ అధికారులు మీడియాకు వివరించారు.

ఇండియాతో శాంతిని కోరుకుంటున్నామంటూ కలరింగ్ ఇస్తున్న పాకిస్థాన్ పన్నాగాలను త్రివిధ దళాల అధికారులు ఢిల్లీలో వివరించారు. శాంతి శాంతి అంటూనే భారత సైన్యం పైకి మిసైల్స్ ప్రయోగిస్తోందని చెప్పారు. భారత్ తో చర్చలకు సిద్ధమంటూ.. శాంతి సంకేతంగా అభినందన్ వర్దమాన్ ను ఇండియాకు పంపిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని చెప్పడంతో… దానికి కౌంటర్ ఇచ్చారు అధికారులు. శాంతిని కోరుకుంటున్న పాకిస్థాన్ ఫిబ్రవరి 26న భారత ఆర్మీ, సైనిక శిబిరంపై దాడి చేయడానికి ప్రయత్నించిందని చెప్పారు.

ఫిబ్రవరి 26, 27వ తేదీల్లో భారత మిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ … తమ ఎఫ్ 16 ఎయిర్ మిసైల్ ను ప్రయోగించిందని చెప్పారు ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్. భారత భూభాగంలోని తూర్పు రాజౌరీలో ఎఫ్ 16 శకలాలు పడ్డాయని చెప్పారు. పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తో… ఎఫ్ 16 ఎయిర్ మిసైల్ ను  ప్రయోగించిందని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. సైనికులను టార్గెట్ చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని ను… భారత ఎయిర్ ఫోర్స్ మిగ్ 21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూల్చేసిందని చెప్పారు ఆర్జీకే కపూర్. పాకిస్థాన్ జెట్ ఫైటర్ బాంబులు విడిచిందని.. ఐతే.. ఎటువంటి నష్టం కలగలేదని వివరించారు. పాకిస్థాన్ తాము ఎటువంటి వైమానిక దాడి చేయలేదని చెబుతోందని.. ఇది అబద్దమని చెప్పారు.

భారత్ లో పౌరుల రక్షణ, భద్రతకు తాము అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామనీ.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేవరకు ఆదేశంతో తమ పోరాటం కొనసాగుతుందని… ఉగ్రవాద శక్తులపై తమ యుద్ధం ఆగదని ప్రకటించారు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు.