
నెలాఖరుకల్లా విడుదల చేయాలి
లేకుంటే ఆగస్టు 1 నుంచి సమ్మె
ఈ నెల 16న ఆరోగ్యశ్రీ
సీఈవోకు నోటీసులు?
దవాఖాన్లలో ఇప్పటికే
కొన్ని సేవల నిలిపివేత
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు హాస్పిటల్స్ యోచిస్తున్నాయి. సుమారు రూ.12 వందల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో సమ్మె దిశగా ఆలోచన చేస్తున్నాయి. దీనిపై ఈ నెల 16న ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్కరాజ్‌తో సమావేశమై, ఆయనకు సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ సురేశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల చివరి నాటికి నిధులు విడుదల చేయకపోతే, ఆగస్టు 1 నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.
చిన్న ఆస్పత్రుల తిప్పలు
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో మొత్తం 246 ప్రైవేటు, 17 కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. నెలలకొద్దీ బకాయిలు విడుదల చేయకపోవడంతో చిన్న ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పాక్షికంగా నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ కింద 949 రకాల చికిత్సలను అందించాల్సి ఉండగా, కేవలం ఐదారు రకాల కేసులనే యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఆస్పత్రుల నిర్వాహణ, సిబ్బంది జీతాలకు కష్టమవుతోందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని హాస్పిటళ్లకు 2017 డిసెంబర్ నాటి బకాయిలు కూడా విడుదల కాలేదని వాపోతున్నారు. ‘ఫస్ట్ ఇన్ – ఫస్ట్ ఔట్’ విధానాన్ని పాటించకుండా కార్పొరేట్ ఆస్పత్రులకు, ప్రైవేటు టీచింగ్ హాస్పిటల్స్‌కు ముందుగా నిధులు విడుదల చేస్తున్నారని చిన్న ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.
నెలకు రూ.80 కోట్లు
ఆరోగ్యశ్రీ కింద రాష్ర్టంలోని 70 లక్షల కుటుంబాలకు చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందుకోసం ఏటా రూ.800 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. సగటున నెలకు రూ.70 కోట్ల నుంచి 80 కోట్ల బిల్లులు జనరేట్ అవుతున్నాయి. అయితే కనీసం ఐదారు నెలలకోసారి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో బకాయిలు వందల కోట్లలో పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2018 నవంబర్‌లో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. దీంతో తాత్కాలికంగా రూ.118 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, త్వరలోనే మొత్తం బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. హాస్పిటళ్లు సమ్మె విరమించాయి. ఇది జరిగి 7 నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో బకాయిలు విడుదల చేయలేదు. దీంతో మరోసారి సమ్మెకు దిగాలని హాస్పిటళ్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి.
బంద్ పెడ్తరా?
పొమ్మనలేక పొగ పెడుతున్నట్టుగా ప్రభుత్వం తమతో వ్యవహరిస్తోందని నెట్‌వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. నేరుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో, పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. అన్ని హెల్త్ పథకాలను ఒకే గొడుగు కిందకి తీసుకురావాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ అనుమానం మరింత బలపడిందని అంటున్నారు. బకాయిలు విడుదల చేయకపోవడం కూడా ఇందులో భాగమేనన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. పథకం రద్దు చేసినా తమకేమీ అభ్యంతరంలేదని, బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల నిర్వాహణ కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల కిందట నిర్ణయించిన ధరలకే సేవలందిస్తున్నా, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం సరికాదంటున్నారు. వెంటనే మొత్తం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.