యూట్యూబర్ : ట్రక్ డ్రైవర్ నుంచి నేషనల్ పర్మిట్ వ్లాగర్ దాకా .. మహిళ డ్రైవర్ ఇన్స్పిరేషనల్ జర్నీ

యూట్యూబర్ : ట్రక్ డ్రైవర్ నుంచి నేషనల్ పర్మిట్  వ్లాగర్ దాకా .. మహిళ డ్రైవర్ ఇన్స్పిరేషనల్ జర్నీ

పెద్ద పెద్ద ట్రక్‌‌లను నడిపే డ్రైవర్లకు చాలా ధైర్యం ఉండాలి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవాలి. అందుకే ఈ వృత్తిలో ఎక్కువగా మగవాళ్లే  కనిపిస్తుంటారు. కానీ.. జలజ మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా పన్నెండు చక్రాల ట్రక్‌‌ని దేశమంతా నడుపుతోంది. అంతేకాదు.. తన జర్నీలో ఎదురయ్యే అనుభవాలతో పాటు అందమైన ప్రదేశాల గురించి వివరిస్తూ.. వ్లాగ్స్​ చేస్తోంది. దాంతో ఇప్పుడామె సోషల్​ మీడియాలో సెలబ్రిటీగా అయిపోయింది.

కేరళలోని కొట్టాయం జిల్లాలోని ఎట్టుమానూర్‌‌లో జలజ, రతీష్ దంపతులు ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన జలజ పెండ్లి తర్వాత 19 సంవత్సరాల పాటు ఇంటికే పరిమితమయ్యింది.  కుటుంబ బాధ్యతలతో పాటు పిల్లల్ని చూసుకోవడమే ఆమె డైలీ రొటీన్​. రతీష్​ 2003లో బ్యాంక్ లోన్‌‌తో ఒక ట్రక్​ కొని ‘పుత్తెట్టు ట్రాన్స్‌‌పోర్ట్స్‌‌’ పేరుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేసి సక్సెస్​ అయ్యాడు. అతని తమ్ముడితో కలిసి వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ప్రస్తుతం వాళ్ల ట్రాన్స్​పోర్ట్‌‌లో 27 నేషనల్​ పర్మిట్​ ట్రక్‌‌లు ఉన్నాయి. రతీష్ కూడా రెగ్యులర్​గా డ్రైవింగ్​ చేస్తుంటాడు. అందులో భాగంగానే దేశంలోని చాలా రాష్ట్రాలకు వెళ్లాడు.

 భారతదేశం అంతటా తాను చేసిన ట్రక్ ప్రయాణాల గురించి, తాను చూసిన ప్రదేశాల గురించి భార్య జలజతో పంచుకునేవాడు. ఆమెకు కూడా వాటన్నింటినీ చూడాలి అనిపించేది. ఒకరోజు తన మనసులో మాటను రతీష్​కు చెప్పింది. తాను కూడా ట్రక్​లో వచ్చి దేశమంతా చూస్తానంది. దానికతను సరదాగా ‘‘నువ్వు లారీ నడపగలిగితే నాతో పని లేకుండానే దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు” అన్నాడు. ఆ మాటలు విన్న జలజకు డ్రైవింగ్​ చేయాలనే కోరిక కలిగింది. కట్​ చేస్తే.. ఇప్పుడు పుత్తెట్టు ట్రావెల్స్‌‌లో ఆమే మెయిన్​ డ్రైవర్​. 

డ్రైవింగ్​ నేర్చుకుని..

ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్కచేయక జలజ 12 చక్రాల ట్రక్ నడపడం నేర్చుకుంది. 2018లో హెవీ వెహికల్ లైసెన్స్ తీసుకుంది. కొన్నాళ్లు డ్రైవింగ్​ ప్రాక్టీస్​ చేశాక 2022లో మొదటిసారిగా ప్రయాణం మొదలుపెట్టింది. కేరళలోని పెరుంబవూర్‌‌లోని ఒక ఫ్యాక్టరీ నుంచి ప్లైవుడ్ లోడ్‌‌ తీసుకుని కాశ్మీర్‌‌లోని శ్రీనగర్‌‌కు వెళ్లింది. ఆమెకు సాయంగా భర్త రతీష్, ఆమె బంధువు కూడా ట్రక్​లో వెళ్లారు. ఆమె ట్రక్​ జర్నీతోపాటే యూట్యూబ్​లో వ్లాగింగ్ జర్నీని కూడా మొదలుపెట్టింది. అప్పటినుంచి ట్రక్​ నడుపుతూ ఎక్కడికి వెళ్లినా అక్కడి విశేషాలను వ్లాగ్స్​ రూపంలో తీసి తన యూట్యూబ్ చానెల్​ ‘పుత్తెట్టు ట్రావెల్ వ్లాగ్’లో అప్​లోడ్​ చేస్తోంది. 

ట్రక్​ లైఫ్

సాధారణంగా ట్రావెల్ వ్లాగ్స్​లో పర్యాటక కేంద్రాల మీదే ఎక్కువ దృష్టిపెడుతుంటారు. కానీ.. ‘పుత్తెట్టు ట్రావెల్ వ్లాగ్’​లో ట్రక్ డ్రైవర్ల లైఫ్​ని, వాళ్లు ఎదుర్కొనే సమస్యలను కూడా చూపిస్తోంది. జలజ, రతీష్ ట్రక్‌‌లోనే వంట చేసుకుంటారు. అందులోనే పడుకుంటారు. దూర ప్రాంతాలకు లోడ్​ తీసుకెళ్లినప్పుడు ఖాళీగా తిరిగి వస్తే.. నష్టం వస్తుందని మరో గిరాకీ దొరికే వరకు రెండు మూడు రోజులు అక్కడే ఉంటారు. అలా లోడ్​లు డెలివరీ చేస్తూ.. దేశమంతా తిరుగుతూ కొన్నాళ్లకు ఇంటికి చేరుకుంటారు. 

ఆమె ఇప్పటివరకు 22  రాష్ట్రాలు, లడఖ్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు నేపాల్‌‌లో కూడా లోడ్​ డెలివరీ చేసింది. కశ్మీర్​లోని హిమాలయాల నుంచి పోర్‌‌బందర్ సముద్రతీరాల వరకు, కోల్‌‌కతాలో రద్దీ రోడ్ల నుండి మేఘాలయలోని ఎత్తైన కొండల వరకు ఎన్నో ప్రాంతాలను వ్లాగ్స్​లో చూపించింది జలజ. అయితే.. కేవలం అక్కడ ప్రదేశాలనే కాదు.. ట్రావెలింగ్​లో ఆమె కలిసిన వ్యక్తుల కథలను, వాళ్ల కల్చర్​ని కూడా వీడియోల్లో చూపిస్తుంటుంది. 

సోషల్​ మీడియా ఫాలోయింగ్​

పుత్తెట్టు ట్రావెల్ వ్లాగ్​ చానెల్​ని 2021 డిసెంబర్​ 13న మొదలుపెట్టింది జలజ. 2022 నుంచి రెగ్యులర్​గా వీడియోలు అప్​లోడ్​ చేస్తోంది. ఇప్పటివరకు చానెల్‌‌లో 974 వీడియోలు అప్​లోడ్​ చేసింది. వాటిలో రెండు మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు చాలానే ఉన్నాయి. చానెల్​ని ఇప్పటివరకు 5.5 లక్షల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. జలజ యూట్యూబ్​తోపాటు ఇతర సోషల్​ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్​లో కూడా యాక్టివ్​గా ఉంటోంది. ఆమెని ఫేస్​బుక్​లో 6.78 లక్షల మంది, ఇన్​స్టాగ్రామ్​లో 4.92 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
 

ఎంతోమందికి స్ఫూర్తి

ట్రక్ లైఫ్ లో అడ్డంకులను దాటుకుని నిలబడి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది జలజ. తన కూతుళ్లు దేవిక, గోపికలు కూడా జలజ నుంచి చాలా నేర్చుకున్నారు. బీకాం చదువుతున్న దేవిక 20 ఏళ్ల వయసులోనే హెవీ వెహికల్ లైసెన్స్ పొందింది. మహిళా దినోత్సవం రోజు ఆమె చేసిన డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండో కూతురు గోపిక కూడా భవిష్యత్తులో ట్రక్లు నడుపుతానంటోంది. జలజ తోడికోడలు సూర్య కూడా డ్రైవింగ్ నేర్చుకుంది. అప్పుడప్పుడు జలజతోపాటు ట్రిప్లకు వెళ్తాంది.

అడ్డంకులు వచ్చినా..

జలజ జమ్మూ- శ్రీనగర్ మధ్య కొండచరియలు జారిపడే ప్రమాదకరమైన రోడ్లలో కూడా 12 చక్రాల పెద్ద లారీని ఈజీగా నడిపింది. అక్కడి టోల్ బూత్ సిబ్బంది నుంచి పోలీసుల వరకు అందరి గౌరవాన్ని సంపాదించింది. ట్రావెలింగ్​లో ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని నిలబడింది. చాలాసార్లు సరైన వాష్​రూమ్​లు లేకపోవడంతో ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంది.