
స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. శుక్రవారం (ఆగస్టు 15) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్. గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు స్కీంను ప్రారంభించారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ సహా బస్సులో ప్రయాణించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి సెంటర్, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి సెంటర్, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కామెంట్స్:
- ఉచిత బస్సు వల్ల 2 కోట్ల 60 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది
- ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు అండగా ఉంటాం..
- స్వాతంత్ర దినోత్సవం రోజు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టాం.
- మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతుంది..
- రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం.
- సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయింది.. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం.
- వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్లపాటు నవ్వడమే మరిచిపోయారు..
- వైసీపీ పాలనలో ఇంటా, బయట ప్రజలకు ఆనందం లేకుండా పోయింది.
- మహిళా సాధికారత కోసమే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశా.
- ఆర్టీసీ కండక్టర్లుగా తొలుత మహిళలను తీసుకున్నది మేమే.. మహిళలు త్వరలో ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రావాలి.
- ఎలాక్టికల్ బస్సులకు మహిళలు డ్రైవర్ లు గా నియమిస్తాం.
- రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం.. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం.
- ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ 2047 తెస్తే.. మనం స్వర్ణాంధ్ర 2047 తీసుకువచ్చాం..
- మహిళలకు ఆర్థిక స్వతంత్రం తేవటానికి.. మీ గౌరవం మరింత పెంచటానికి NDA ప్రభుత్వం పనిచేస్తుంది..
- మహిళలు రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వెళ్లే స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కల్పించింది.
- కూటమి పొత్తు గురించి భేషరతుగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్.
- ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు.
- మహిళలకు యూనివర్సిటీని ప్రారంభించింది రామారావు.
మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు అరికట్టేలా చట్టం: మంత్రి లోకేశ్
మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు అరికట్టేలా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు ఉండకూడదని సూచించారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారన్న మంత్రి.. ఆవకాయ పట్టాలన్న.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా అది మహిళలకే సాధ్యమని అన్నారు.
మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ ది అయితే.. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత చంద్రబాబుది అన్నారు లోకేశ్. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు. అనేక ప్రభుత్వ పథకాలు స్త్రీల పేరుతోనే అమలు చేస్తున్నామని తెలిపారు.
మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పి మంత్రి.. తమ ఇంట్లో కూడా మహిళలు వ్యాపారంలో రాణిస్తున్నారని చెప్పారు. మా అమ్మ భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి వ్యాపారంలో రాణిస్తున్నారని తెలిపారు.