
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. దీనినే కృష్ణాష్టమి అని, జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని అని రకరకాల పేర్లతో పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ఈ రోజున భక్తులందరూ అత్యంత భక్తి భావంతో కృష్ణుని పూజిస్తారు. శ్రీకృష్ణుడి పుట్టిన రోజును అందరం ఘనంగా జరుపుకుంటాం గానీ ఆ బృందావనమాలి ఎన్నో పుట్టినరోజును 2025లో జరుపుకోబోతున్నామో ఎంతమందికి తెలుసుంటుంది. ఆ జగన్నాటక సూత్రధారి పుట్టి 2025వ సంవత్సరానికి 5 వేల 251 సంవత్సరాలు నిండాయి. శ్రీకృష్ణుడి 5 వేల 2 వందల 52వ పుట్టినరోజును మనం 2025లో శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకోబోతున్నాం.
ఆయన జన్మ స్థానమైన ఉత్తరప్రదేశ్లోని మథురలో జన్మాష్టమి వేడుకలను ఆగస్ట్ 16 నుంచి 17 వరకూ ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధర్మాన్ని రక్షించడానికి, మానవాళిని సంరక్షించడానికి విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం. బాలకృష్ణుడిగా అల్లరి పనులు చేసిన, వెన్నదొంగగా మారి తల్లుల మనసు దోచిన కన్నయ్య అల్లరి మనసుకు సంతోషం కలిగిస్తుంది. గోవర్ధన గిరిధారిగా, కాళీయమర్దనుడిగా , గోపికా లోలుడిగా, అసుర సంహారిగా, గీత ప్రబోధకుడిగా కృష్ణుడు ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన సందేశం మనలను నడిపిస్తుంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున యువత ఉత్సాహంతో ఉట్టి కొట్టడాన్ని చూసే ఉంటారు. ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు పాలు చిల్లరడబ్బులు సేకరించి దానిని ఉట్టి లో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకీ పైకీ లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమిష్టిగా ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. వసంత నీళ్ళు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు.
Also read:- కన్నయ్యకు వెన్నముద్దలు, అటుకుల వడ.. పాయసం..ఎంతో ఇష్టం..ఇలా తయారు చేసి నివేదించండి.!
కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానమాచరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేయాలి. జన్మాష్టమి రోజున కృష్ణుడిని పూజించడం అంటే, చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో , ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో .. అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి , ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో అభిషేకం చేసి , చక్కగా పట్టు వస్త్రాలు కట్టి , ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసీ దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వేయాలి.