Krishna Janmashtami 2025 : కన్నయ్యకు వెన్నముద్దలు, అటుకుల వడ.. పాయసం..ఎంతో ఇష్టం..ఇలా తయారు చేసి నివేదించండి.!

Krishna Janmashtami 2025 : కన్నయ్యకు వెన్నముద్దలు, అటుకుల వడ.. పాయసం..ఎంతో ఇష్టం..ఇలా తయారు చేసి నివేదించండి.!

కాస్త వెన్న, గుప్పెడు అటుకులు ఉంటే చాలు కన్నయ్యకి. వాటికోసం చిన్ని కృష్ణుడి చేసిన సాహసాలు... యశోదమ్మతో తిన్న చివాట్లు అందరికీ తెలిసినవే. గోపికలు ఎంత కట్టడి చేసినా నిమిషాల్లో వెన్న కుండ ఖాళీ చేసేవాడు కన్నయ్య. ఇక అటుకలతో కృష్ణుడికి ఉన్న బంధాన్ని మాటల్లో చెప్పలేం. మరి కృష్ణుడు అంత ఇష్టంగా తినే వీటిని  కృష్ణుని పుట్టినరోజునాడు ప్రసాదంగా... పెట్టకపోతే ఎలా? ఆగస్టు 16న  మన ఇంట్లోని చిన్ని కృష్ణుళ్లకి, గోపికమ్మలకి నోరూరించే ఈ వంటలు వండి పెట్టేద్దాం.. మరి అలాంటి వంటకాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

వెన్నముద్దలు తయారీకి కావలసినవి

  • వెన్న–50 గ్రాములు
  • బియ్యప్పిండి- అరకప్పు
  • మినప్పిండి- పావు కప్పు
  • వచ్చికొబ్బరి తరుము - పావు కప్పు
  • ఉప్పు– చిటికెడు
  • ఇంగువ - చిటికెడు
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:  గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, ఇంగువ, వెన్న వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని, కొంచెం కొంచెం తీసుకుని చిన్నచిన్న ఉండలుగా చేసి కాగే నూనెలోడీప్​ పై చేయాలి అంతే వెన్న ముద్దలు రెడీ.

 వెన్న ఉండలు తయారీకి కావాల్సినవి

 

  • మైదా-రెండు కప్పులు
  • చక్కెర- రెండు కప్పులు
  • బియ్యప్పిండి- పావు కప్పు
  • వెన్న - 50 గ్రాములు
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • వంటసోడా- చిటికెడు

తయారీ విధానం: గిన్నెలో మైదా, బియ్యప్పిండి, వెన్న, వంటసోడా వేసి గోరువెచ్చని నీళ్లు పోసి పిండి ముద్దలా చేయాలి. దాని పైన తడి బట్ట వేసి గంట సేపు పక్కన పెట్టాలి. ఆ తరువాత చిన్న చిన్న ఉండలు చేసి వాటి మీద కూడా ఐదు నిమిషాల పాటు తడిబట్ట ఉంచాలి. ఇప్పుడు పాన్  లో నూనె వేడి చేసినె వెన్న ఉండల్ని సన్నటి మంట మీద లేత గోధుమరంగు వచ్చేవరకు వేగించాలి. వేగిన ఉండల్ని కాసేపు చల్లారనివ్వాలి. ఈ లోపు చక్కెరలో తగినన్ని నీళ్లు పోసి తీగపాకం రెడీ చేయాలి. వేగించిన వెన్న ఉండల్ని చక్కెర పాకంలో వేసి గరిటెతో కొద్ది సేపటి వరకు ఆపకుండా కలపాలి.

Also Read:-శ్రీ కృష్ణుని జననమే ఓ అద్భుతం.. నల్లనయ్య పుట్టిన రోజు వేడుకలు ఇలా..!

అటుకులు పుట్టు తయారీకి కావాల్సినవి:

  • వెన్న - అర కప్పు 
  • అటుకులు - ఒక కప్పు
  • బెల్లం - అర కప్పు
  • కొబ్బరి తురుము- రెండు టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు (వెన్నలో వేగించి)- పది
  • యాలకుల పొడి- పావు టీ స్పూన్
  • నీళ్లు- అర కప్పు

తయారీ విధానం: పాన్​ లో  అటుకులు దోరగా వేగించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లంలో నీళ్లు పోసి కరిగిన తర్వాత వడపోయాలి. ఆ నీటిని మందపాటి గిన్నెలో పోసి తీగ పాకం -వచ్చేవరకు ఉడికించాలి. అందులో యాలకుల పొడి, అటుకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి కలిపి మూత పెట్టి మిశ్రమాన్ని వేడి చేయాలి. చివరిగా కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. వేడిగా వడ్డించేటప్పుడు పైన కొద్దిగా వెన్న ముద్ద పెట్టవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే దించినప్పుడే పైన వెన్న వేసి కలపాలి

అటుకుల పాయసం తయారీకి కావలసినవి

  •  మీగడ పాలు –ఒక లీటరు, 
  • అటుకులు - వంద గ్రాములు, 
  • చక్కెర- పావు కిలో, 
  • యాలకుల పొడి- పావు టీ స్పూన్,
  •  జీడిపప్పు- నాలుగు టేబుల్​ స్పూన్లు, 
  • కిస్ మిస్- రెండు టేబుల్ స్పూన్లు, 
  • నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు 

తయారీవిధానం: ముందుగా అటుకుల్ని కడిగి నీళ్లు లేకుండా పిండి పది నిమిషాల సేపు ఆరబెట్టాలి. ముందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించాలి. అందులో అటుకులు వేసి తక్కువ మంట మీద కాసేపు ఉడికించాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి పాలు సగమయ్యేవరకు ఉడికించి దించాలి. మరొక పాన్ లో నెయ్యి వేడిచేసి జీడి పప్పు, కిస్ మిస్ వేగించి పాయసంలో కలపాలి.

అటుకుల వడ తయారీకి కావాల్సినవి: 

  • అటుకులు (నీళ్లలో తడిపి పిండుకోవాలి) - ఒక కప్పు 
  • ఉల్లిగడ్డ తరుగు-రెండు టేబుల్ స్పూన్లు శెనగపిండి ఒక టేబుల్​ స్పూన్​
  • బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు
  • అల్లం పేస్ట్- ఒకటీస్పూన్ 
  • పచ్చిమిర్చి పేస్ట్- ఒకటిన్నర టీ స్పూన్ పసుపు--పావు టీ స్పూన్
  • జీలకర్ర- అర టీస్పూన్
  • కొత్తిమీర తురుము- మూడు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు- తగినంత
  • నూనె - డీప్ ఫ్రైకి సరపడా తయారీ

తయారీ విధానం:  గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులో పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు కూడా వేసి మరోసారి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకునే చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడలా ఒత్తి కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.