
వయసు మీద పడ్డాక రకరకాల సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు పెద్దవాళ్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే శేష జీవితం హాయిగా గడుపుతారు. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి స్నేహితులు, పొల్యూషన్ లేని వాతావరణం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం.. ఇలాంటివి తప్పనిసరిగా ఉండాలి. అందుకే వాటన్నింటినీ ఒకేచోట కల్పించేందుకు సిటీల శివార్లలో రిటైర్మెంట్ హోమ్స్ రెడీ అవుతున్నాయి. వాటిలో ఇంకా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే.. - హైదరాబాద్ సిటీ, వెలుగు
రియల్ ఎస్టేట్‌లో రోజురోజుకూ కొత్త ట్రెండ్‌ను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్టుల ట్రెండ్ నడుస్తోంది. ఫారిన్ దేశాలను ఫాలో అవుతూ... అలాంటివే మన దగ్గర కడుతున్నారు. ఓఆర్‌ఆర్ దాటిన తర్వాత ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఇప్పటికే కొన్ని రిటైర్మెంట్ హోమ్స్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. అయితే.. వీటిని అందుబాటు ధరల్లోకి తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
రిటైర్మెంట్ హోమ్స్ అంటే..
ఉద్యోగం, వ్యాపారాల కోసం కొంతమంది ఫ్యామిలీతోపాటు ఊళ్ల నుంచి సిటీకి వచ్చేస్తుంటారు. ఊళ్లలో సరైన సదుపాయాలు లేకపోవడం, సిటీలో ఉండే సౌకర్యాలకు అలవాటుపడడం వల్ల రిటైర్మెంట్ తర్వాత చాలామంది తిరిగి ఊళ్లకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. పైగా వాళ్లలో చాలామంది పిల్లలు చదువులు, ఉద్యోగాల కోసం వేరే సిటీలకు, ఫారిన్‌కు వెళ్తున్నారు. దాంతో వాళ్లకు తోడు లేకుండా పోతోంది. అలాంటి వాళ్లకోసం డిజైన్ చేసినవే ఈ రిటైర్మెంట్ హోమ్స్. ఇవి కూడా ఓల్డేజ్ హోమ్స్లానే ఉంటాయి. కాకపోతే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.
సిటీకి దూరంగా..
పెద్దవాళ్లకు సిటీలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్య పొల్యూషన్. అందుకే కాలుష్యానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉండేలా సిటీ శివార్లలోని ప్రశాంతమైన వాతావరణంలో వీటిని కడుతున్నారు. పచ్చని వాతావరణంలో అన్ని సదుపాయాల మధ్య ఇల్లు ఉంటుంది. వీటిలో ఉండేది పెద్దవాళ్లు కాబట్టి లగ్జరీ కన్నా.. సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు బిల్డర్లు.
డిమాండ్ పెరుగుతోంది
దేశంలో వయసుపైబడిన వాళ్ల సంఖ్య పెరుగుతుండడంతో మెట్రో నగరాల్లో రిటైర్మెంట్ హోమ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్(యుఎన్డీఈఎస్ఏ) ప్రకారం.. 2010లో 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల భారతీయుల సంఖ్య దాదాపు 91.6 మిలియన్లు. అదే 2025 చివరినాటికి ఈ సంఖ్య 158.7 మిలియన్లకు పెరగనుంది. గ్రేటర్లో దాదాపు 5–6 లక్షల మంది రిటైర్మెంట్ వయసువాళ్లు ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. గడిచిన పదేళ్లలో సిటీల్లో ఇలాంటి రిటైర్మెంట్ సొసైటీల పెరుగుదలకు ఇదే కారణమని రియల్ ఎస్టేట్ సంస్థలు అంటున్నాయి.
సౌకర్యాలేముంటాయి?
వయసు పైబడిన వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఇండ్లలో చాలా రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా పెద్దవాళ్లకు మోకాళ్ల నొప్పులు ఉంటాయి. కాబట్టి మెట్లు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. బాత్రూమ్లు సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటాయి. అంటే కాళ్లు జారకుండా ఉండేండుకు యాంటీ-స్కిడ్ టైల్స్‌ని వాడతారు. అపార్ట్‌మెంట్ పరిసరాలు, గార్డెన్.. ఎక్కడికైనా చక్రాల కుర్చీని తీసుకెళ్లడానికి వీలుండేలా నిర్మాణాలు ఉంటాయి. సమస్య వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ అందించేందుకు ప్రత్యేకంగా క్లినిక్‌ని ఏర్పాటు చేస్తారు.
ఫిట్నెస్ సెంటర్లు, యోగా స్టూడియోలు, వెల్నెస్ సౌకర్యాలు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా డాక్టర్లు రోజూ హెల్త్ చెకప్ చేస్తుంటారు. అప్పుడప్పుడు అందరూ కలిసి భోజనాలు చేసేందుకు హాల్, ఎంటర్టైన్మెంట్ జోన్లు , గ్రూప్ డిస్కషన్స్ కోసం, మీటింగ్‌ల కోసం సెమినార్ హాల్స్ లాంటివి ఉంటాయి. వీటివల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మంచి జీవనశైలి అలవాటు అవుతుంది. సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.
పొల్యూషన్‌కు దూరంగా..
బోర్వెల్ బిజినెస్ చేసి రిటైర్ అయ్యాను. బిజినెస్ చేసే టైంలో దిల్సుఖ్నగర్, తార్నాకలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఘట్కేసర్ మండలం నారపల్లి దివ్యనగర్‌లో ఉంటున్నాం. నా సొంత ఊరు నల్గొండ జిల్లా నకిరేకల్. పిల్లలు ఉద్యోగరీత్యా హైటెక్ సిటీలో ఉంటున్నారు. సౌండ్, ఎయిర్ పొల్యూషన్‌కి దూరంగా ఉండడానికి రిటైర్మెంట్ హోమ్స్‌లో ఫ్లాట్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఇల్లు అందుబాటు ధరలో దొరికితే తీసుకుంటా. - మారెడ్డి జైపాల్ రెడ్డి