ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు, తుఫాన్ బీభత్సం.. 50 మందికి పైగా మృతి.. తుడిచిపెట్టుకుపోయిన ఇళ్లు !

ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు, తుఫాన్ బీభత్సం.. 50 మందికి పైగా మృతి.. తుడిచిపెట్టుకుపోయిన ఇళ్లు !

లక్నో: ఉత్తరప్రదేశ్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్, భదోహి, ఫతేపూర్, ఉన్నావ్, కాన్పూర్ దేహత్, చందౌలీ, సోన్‌భద్ర, బదౌన్ జిల్లాలను భారీ వర్షంతో పాటు తుఫాను అతలాకుతలం చేసింది.

బుధవారం సంభవించిన ఈ తుఫాను కారణంగా ఉత్తర ప్రదేశ్లో కనీసం 56 మంది మరణించారు. ఒక్క ప్రయాగ్ రాజ్లోనే 16 మంది తుఫాన్ కారణంగా చనిపోయారు. చెట్లు కూలాయి. ఇళ్లు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుని పోయాయి. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం కావడంతో ఊళ్లకు ఊళ్లు అంధకారంలో మునిగిపోయాయి.

ప్రయాగ్రాజ్ ప్రాంతంలో 16, భదోహి జిల్లాలో 16, ఫతేపూర్ జిల్లాలో 9, ఉన్నావ్‌లో 4, కాన్పూర్ దేహత్‌లో 3, బుడౌన్‌లో 5, చందౌలిలో 2 మరియు సోన్‌భద్రలో ఒకరు తుఫాను కారణంగా చనిపోయారు. 

ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా అకాల వర్షాలు, తుఫానులు, పిడుగుపాటు వల్ల నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని ఆయన పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అధికారులను అప్రమత్తంగా ఉండాలని యూపీ సీఎం ఆదేశించారు. నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, భీమా సంస్థలను ఆయన ఆదేశించారు. సర్వే అనంతరం వెంటనే నష్ట అంచనాను పూర్తి చేసి, ఆలస్యం లేకుండా నష్టపరిహారాన్ని పంపిణీ చేయాలని సూచనలు జారీ చేశారు.