చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు

చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా మృగశిరకార్తె రోజు ఉచిత చేప ప్రసాదం పంపిణీ ఉంటుంది. ఈ నెల 8, 9న జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చేప ప్రసాదం పంపిణీపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన హరినాథ్ గౌడ్, మత్స్య, పోలీస్, ఆర్ అండ్ బీ, వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నా రు. 173 ఏళ్లుగా బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని స్వచ్ఛందంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు తలసాని. ఈసారి కూడా చేప ప్రసాదాన్ని బత్తిని సోదరులు రోగులకు ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. జూన్ 8వ తేది సాయంత్రం 6.00 గంటల నుండి చేప ప్రసాదం పంపిణీ చేస్తారన్నారు మంత్రి తలసాని.

ఆస్తమా రోగులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలిరానుండటంతో.. వారికి ఇబ్బందులు రాకుండా.. చూస్తామన్నారు జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ అధికారులు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బందోబస్తు కోసం వివిధ స్థాయిల్లో పనిచేసే పోలీసులను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రెవెన్యూ శాఖకు సంబంధిం చిన 14 మంది తహసీల్దార్లు ఒక స్పెషల్ డిప్యూటి కలెక్టరుతో బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

చేప ప్రపాదం పంపిణీకి దాదాపు 1లక్ష 60 వేల చేపపిల్లలను సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు మత్స్యశాఖ అధికారులు. హైదరాబాదు మినహా రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల నుండి చేప పిల్లలను సేకరించి ఒక రోజు ముందుగానే రాజేంద్రనగర్ లోని నర్సరీలో భద్రపరుస్తామన్నారు. జీహెచ్ఎంసీ తరఫున 100 మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు మూడు షిప్టులలో పనిచేసేందుకు 300 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముష్రఫ్ అలీ. మెట్రోవాటర్ బోర్డు ఆధ్వర్యంలో మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సిబ్బందితో పాటు 3 అగ్నిమాపక ఇంజిన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

చేప ప్రసాదం కోసం నగరానికి వచ్చే వారికోసం ప్రధాన బస్టాండులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకునేలా 130 అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు ఆర్టీసీ అధికారులు. ఈ నెల 7న ఉదయం 4గంటల నుంచే ప్రత్యేక బస్సులు మొదలవుతాయనీ, ప్రసాదం కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.