
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ( Bigg Boss Telugu Season 9 ) మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు, సరికొత్త ఉత్కంఠను పరిచయం చేస్తూ "డబుల్ హౌస్, డబుల్ డోస్" ( Double House, Double Dose ) అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తోంది. దీనికి సంబందించిన ప్రోమోను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు నిర్వాహకులు. కింగ్ అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) తనదైన స్టైల్‌లో మరోసారి హోస్ట్‌గా కొనసాగుతూ, ఈ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చనున్నారు.
"డబుల్ హౌస్, డబుల్ డోస్" అంటే ఏంటి?
ఇప్పటివరకు బిగ్ బాస్ ఇంట్లో ఒకే ఇంటిలో అందరూ పోటీపడేవారు. కానీ ఈ సీజన్ ఒక పెద్ద ట్విస్ట్‌తో రాబోతోంది. "డబుల్ హౌస్" కాన్సెప్ట్ ప్రకారం, కంటెస్టెంట్లను రెండు వేర్వేరు బృందాలుగా విభజించి, వారిని రెండు వేర్వేరు హౌసెస్ లలో ఉంచుతారు. దీనివల్ల ఆట ప్రారంభం నుంచే తీవ్రమైన పోటీ, అనూహ్యమైన మలుపులు, రెండు బృందాల మధ్య వ్యూహాత్మక ఆటలు మొదలవుతాయి. ఈ డబుల్ హౌస్ విధానం వల్ల ఆటగాళ్ల మధ్య సంబంధాలు, వైరుధ్యాలు మరింత ఆసక్తికరంగా మారతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వినోదం డబుల్, డ్రామా డబుల్, ఎమోషన్స్ డబుల్!
కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా
బిగ్ బాస్ తెలుగును సీజన్ 3 నుంచి విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జున, సీజన్ 9కి కూడా తనదైన స్టైల్, గ్లామర్‌తో హోస్ట్‌గా రాబోతున్నారు. అతని చతురత, కంటెస్టెంట్లతో ఆయన మాట్లాడే విధానం, వీకెండ్ ఎపిసోడ్‌లలో ఆయన ఇచ్చే సలహాలు, హెచ్చరికలు షోకు మరింత ఆకర్షణను తెస్తాయి. ఈ సీజన్ కోసం నాగార్జున భారీ పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రసవత్తరమైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
కొత్త రూల్స్, కొత్త కంటెస్టెంట్స్
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీని కోసం వారిలో40 మందిని ఎంపిక చేసి చివరగా ముగ్గురు సామాన్యులను సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో మునుపెన్నడూ లేని విధంగా కొత్త టాస్క్‌లు, రూల్స్ ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. దీనివల్ల పోటీ మొదటి వారం నుంచే చాలా కఠినంగా మారుతుందని సమాచారం.
'బిగ్ బాస్ తెలుగు 9 'సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ మా, జియో హాట్ స్టార్ లలో ప్రసారం కానుంది. ఈ సీజన్ గత సీజన్లన్నింటినీ మించిపోయేలా ఉంటుంది అనడంలో సందేహం లేదంటున్నారు నిర్వాహకులు. మరి ఈసారి "డబుల్ హౌస్, డబుల్ డోస్" ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.