ఇండియా కూటమి నిరసన సెగ : బారికేడ్ ఎక్కి దూకిన అఖిలేష్ యాదవ్...

ఇండియా కూటమి నిరసన సెగ : బారికేడ్ ఎక్కి దూకిన అఖిలేష్ యాదవ్...

ఢిల్లీ పార్లమెంటు నుండి ప్రతిపక్ష నాయకుల మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోలీసు బారికేడ్‌పైకి ఎక్కి దూసుకెళ్లారు. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటర్ల లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వ్యతిరేకిస్తూ అలాగే  2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు.

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఈ మార్చ్ ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ నుండి మొదలైంది. ఈ మార్చ్ లో ఉభయ సభల నుండి మొత్తం 300 మందికి పైగా ఎంపీలు పాల్గొన్నారు. అయితే, ఢిల్లీ పోలీసులు ఈసీ ఆఫీసుకి వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టడంతో నిమిషాల్లోనే పరిస్థితి వేడెక్కింది. నిజం దేశం ముందు ఉంది. ఈ పోరాటం రాజకీయం కోసం కాదు, రాజ్యాంగాన్ని కాపాడటానికి. ఈ పోరాటం ఒక మనిషి, ఒక ఓటు కోసం. మాకు స్వచ్ఛమైన ఓటర్ల లిస్ట్ కావాలి అని అన్నారు. 

ఈ మార్చ్ సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు, క్విక్ రియాక్షన్ బృందాలను, అదనపు భద్రతా వాహనాలను మోహరించారు. నిరసనకి ముందు ఢిల్లీ పోలీసుల ప్రకారం మార్చ్ కోసం ఎవరు అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్  కంట్రోల్ చేయడానికి EC ఆఫీస్, పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

ALSO READ : 'అణు'కూతలు.. భారత్ మీ మిసైళ్లను కూల్చేసిందని మార్చిపోయావా మునీర్

బీహార్‌లో జరుగుతున్న అక్రమాలు, ఓటర్ల లిస్టుల తారుమారు రాబోయే ఎన్నికలకి ముప్పు కలిగిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. SIRకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పార్లమెంటు నుండి భారత ఎన్నికల కమిషన్ వరకు మార్చ్ నిర్వహించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా ఇతర ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిరసన సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, వాటికి సమాధానాలు అవసరం. ఎన్నికల కమిషన్ దేశం పట్ల బాధ్యత వహించడమే కాకుండా, మన ఎన్నికల గురించి ప్రజల మనస్సులలో ఎటువంటి అనుమానాలు ఉండకూడదనే బాధ్యత కూడా  ఉంది. ఎన్నికలు దేశానికి ముఖ్యమైనది. ప్రజల మనస్సులలో ఏవైనా అనుమానాలు ఉంటే, వాటిని పరిష్కరించాలి అని అన్నారు.