బెంగళూరులో కొత్త మెట్రో లైన్ ప్రారంభించిన ప్రధాని.. టికెట్ కొని సియంతో కలిసి ప్రయాణం..

బెంగళూరులో కొత్త మెట్రో లైన్ ప్రారంభించిన ప్రధాని.. టికెట్ కొని సియంతో కలిసి ప్రయాణం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో ఆర్‌వి రోడ్ నుండి బొమ్మసంద్ర వరకు మెట్రో ఎల్లో లైన్‌ సేవలను జెండా ఊపి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా ఉన్నారు. అయితే రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌లో టికెట్ కొన్న  ప్రధాని తరువాత నమ్మ మెట్రో ఎల్లో లైన్‌లో ప్రయాణించారు.

ఈ ఎల్లో లైన్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టులో భాగం, మొత్తం 16 స్టేషన్లతో 19 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు రూ. 7,160 కోట్లు. ఈ ఎల్లో లైన్ ప్రారంభంతో బెంగళూరులో మెట్రో నెట్‌వర్క్ 96 కి.మీలకు పైగా ఉంటుంది. 

దీనితో పాటు, బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. దీని మొత్తం పొడవు 44 కిలోమీటర్లకు పైగా అంచనా, ఇందులో 31 ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. అలాగే ప్రధాని మోదీ బెంగళూరులో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో కూడా ప్రసంగించారు.

మెట్రోతో పాటు బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు. వీటిలో బెంగళూరు నుండి బెల్గాం, అమృత్సర్ నుండి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) నుండి పూణే వరకు ఉన్న రైళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు బిఎస్ యడ్యూరప్ప సహా చాల మంది రాజకీయ నాయకులు హాజరయ్యారు.