
నందమూరి అభిమానుల అశేష జనసందోహం మధ్య జరిగిన 'వార్ 2' ప్రీ-రిలీజ్ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితంలో తాత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉన్నంత కాలం తనని ఎవరూ ఆపలేరని ఉద్వేగంగా చెప్పారు. అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ గ్రౌండ్ లో నిర్వహించారు.
ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం కథ లేదా ఇతర విషయాలు కాదనన్నారు ఎన్టీఆర్. నువ్వు ఈ సినిమా చేయాలి, నీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీ తీస్తా అని చెప్పిన ఆదిత్య చోప్రా గారి మాటే అని చెప్పారు. ఆయన మాట నమ్మకుండా ఉండి ఉంటే, మీ ముందు ఇంత గర్వంగా నిలబడేవాడిని కాదు అని కృతజ్ఞతలు తెలిపారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లోకి తనని ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
రెండు పెద్ద స్టార్స్‌ను ఒకే సినిమాలో పెట్టుకొని ఇంత అద్భుతంగా సినిమా తీయడం దర్శకుడు అయాన్ ముఖర్జీకే సాధ్యమైందని ప్రశంసించారు . అయాన్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు అని కొనియాడారు. హృతిక్ రోషన్‌తో తన అనుభవాన్ని పంచుకుంటూ 25 సంవత్సరాల క్రితం 'కహోనా ప్యార్ హై'లో హృతిక్ డ్యాన్స్ చూసి నేను మెస్మరైజ్ అయ్యాను. ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో, గొప్ప డ్యాన్సర్‌లలో హృతిక్ ఒకరు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టం. ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే కాదు, హృతిక్ చేస్తున్న తెలుగు సినిమా కూడా అని పేర్కొన్నారు.
తన 25 ఏళ్ల సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, రామోజీరావు గారి ద్వారా పరిచయం అయిన తర్వాత, తన అభిమానులు తనపై చూపించిన ప్రేమను ఎన్నటికీ మర్చిపోలేనని ఎన్టీఆర్ అన్నారు. తనను ప్రోత్సహించిన దర్శక-నిర్మాతలకు, తన తల్లిదండ్రులైన నందమూరి హరికృష్ణ, షాలినిలకు శిరస్సు వంచి నమస్కరించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ బాగుంది. తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు అంటూ అభిమానులను ఉద్దేశించి హీరో హృతిక్ రోషన్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లో 'వార్ 2' వస్తోంది.. యుద్దానికి రెడీనా అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. తారక్ తో నటించడం మొదలు పెట్టినప్పుడే మేమిద్దరం నిజమైన బ్రదర్స్ లా కలిసిపోయాం. నా కెరీర్ లోనూ ' వార్ 2' టాప్ ప్లేస్ లో ఉంటుందని చెప్పారు. ఇందులో కబీర్ పాత్ర చేసినప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ మూవీలో ఎన్నో యాక్షన్, ఎమోషన్ సీన్లు ఉన్నాయి.
కహోనా ప్యార్ హై, క్రిష్ సినిమాలు చేసినప్పుడు ఎంత పేరు వచ్చిందో కబీర్ పాత్ర చేసినప్పుడు అంతే వచ్చిందని చెప్పారు. ఈ మూవీ కచ్చితంగా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. ఎవరూ మిస్ అవ్వొద్దన్నారు. తారక్ ను చూస్తే నన్ను నేను చూసినట్టే అనిపిస్తోంది. నా లాగే తారక్ ఎంతో కష్టపడుతాడు. నేను తారక్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. షాట్ కు ఎలా వెళ్లాలో ఎన్టీఆర్ ను చూసి వందశాతం నేర్చుకున్నానని హృతిక్ ప్రశసించారు.
ఈ మూవీలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఆదిత్య చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం YRF స్పై యూనివర్స్ లో ఆరవ పార్ట్ ఇది. దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ 'వార్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానుంది.