
టాలీవుడ్ లో సినీ కార్మికుల చేపట్టిన ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. వేతనాల పెంపు డిమాండ్‌తో మొదలైన ఈ సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ పరిణామంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ , నిర్మాతల మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
అటు వేతనాల పెంపుపై ఫిలిం ఫెడరేషన్ పట్టు వీడడం లేదు. తమకు 30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్‌లకు వెళ్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. నిర్మాతలు ప్రతిపాదించిన పర్సెంటేజీ విధానాన్ని మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఈ సమ్మె కారణంగా నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్న షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి.
ఈ సమస్య పరిష్కారం కోసం ఇరు వర్గాలు ప్రభుత్వాలను ఆశ్రయిస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో 14 మంది నిర్మాతల బృందం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్‌ను కలిశారు. సినిమా రంగానికి సంబందించిన సమస్యలతో పాటు , ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమస్యలపై మంత్రికి నిర్మాతలు వివరించారు.
ఆ తర్వాత తెలంగాణ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తో దిల్ రాజు, సుప్రియా, పలువురు నిర్మాతలు కలిశారు. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలు, సినీ కార్మికుల సమ్మె, వేతనాల పెంపుం అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కార్మికుల డిమాండ్లను మంత్రి దృష్టికి నిర్మాతలు తీసుకెళ్లారు.
ALSO READ : UstaadBhagatSingh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై మేకర్స్ అప్డేట్..
తెలుగు సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సమస్యలపై చర్చించడానికి రావాలని సూచించారు. ఇందులో భాగంగా, ఫిలిం ఫెడరేషన్ నేతలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి, తమ సమస్యలు, డిమాండ్లను వివరించనున్నారు. ఈ భేటీల తర్వాతైనా ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందా, లేదా అనేది చూడాలి మరి.