పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం స్పీకర్‎దే: మంత్రి శ్రీధర్ బాబు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం స్పీకర్‎దే: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం స్పీకర్‎దేనని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సోమవారం (ఆగస్ట్ 11) కరీంనగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ కేసులో ఎవరెవరిని విచారణకి పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మా మేనిఫెస్టోలోనే కాళేశ్వరంపై జ్యూడిషనల్ ఎంక్వైరీ కమిషన్ వేస్తామని చెప్పాం.. చెప్పినట్లుగానే కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అంశం ‌రాష్ట్రపతి‌, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. 

రాష్ట్రానికి చెందిన ఎనిమిది‌ మంది‌ బీజేపీ ఎంపీలు బీసీ బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు బీజేపీ ఎందుకు మద్దతు తెలపలేదు..? ఆ పార్టీ ఎంపీలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. అలాంటిది ఈరోజు బీసీల గురించి ప్రతిపక్షాలు మాట్లాడితే నమ్ముతారా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ముందుకు పోతామని స్పష్టం చేశారు.