- బాదామ్ కీ జాలి, మహువా లడ్డూలు
- గ్లోబల్ సమిట్లో అతిథులకు అందించనున్న ప్రభుత్వం
- ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమిట్
- పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు
- తెలంగాణ ఘన చరిత్రను చాటేందుకు ఏర్పాట్లు
- మూడు వేల మందికిపైగా దేశ, విదేశీ అతిథుల రాక
- 500 మంది వరకు అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలు కూడా..!
- ప్రత్యేకంగా మూడు హెలిప్యాడ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్
- 40కి పైగా స్టాల్స్, రాత్రి వేళ లేజర్ షోలు, డ్రోన్ షోలు
- బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి వాళ్లూ వచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు:
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ –2025’ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేవలం పెట్టుబడుల కోసమే కాకుండా.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేలా పలు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే ఈ సమిట్‌కు దాదాపు 3 వేల మందికి పైగా దేశ, విదేశీ అతిథులు రానున్నారు.
వీరికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కండ్లకు కట్టేలా స్వాగతం పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతిథులకు ఇచ్చే స్వాగత కానుకల నుంచి, వారికి వడ్డించే విందు వరకు ప్రతి దాంట్లో ‘తెలంగాణ మార్కు’ ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ప్రత్యేక గిఫ్ట్ బాస్కెట్.. సావనీర్ కిట్!
మన చేతివృత్తి కళాకారుల నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేలా.. ‘సావనీర్ కిట్’ పేరుతో గ్లోబల్ సమిట్అతిథులకు ప్రత్యేక గిఫ్ట్ బాస్కెట్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందులో మన నేతన్నల నైపుణ్యాన్ని చాటిచెప్పే పోచంపల్లి ఇక్కత్శాలువాలు, నవాబుల కాలం నాటి హైదరాబాద్ అత్తర్ సీసాలు ఉండనున్నాయి. తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే చేర్యాల పెయింటింగ్స్ ఈ కిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. నిజాం నగరపు ఖ్యాతిని తెలిపే ముత్యాల ఆభరణాలను కూడా ఈ బాస్కెట్‌లో పొందుపరిచారు.
సదస్సు కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ లోగోతో కూడిన జ్ఞాపికలను కూడా అతిథులకు అందజేయనున్నారు. మన కళలను కార్పొరేట్ దిగ్గజాలకు పరిచయం చేయడం ద్వారా స్థానిక కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
నోరూరించే సకినాలు, తీపి అప్పాలు
గ్లోబల్ సమిట్‌కు వచ్చే అతిథుల కోసం తెలంగాణ రుచులతో నోరూరించే వంటకాలనూ ప్రభుత్వం సిద్ధం చేయిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కల్చరల్ ఫుడ్ బాస్కెట్’లో తెలంగాణ స్పెషల్ వంటకాలు దర్శనమివ్వనున్నాయి. కరకరలాడే సకినాలతోపాటు తీపి అప్పాలు, నోట్లో వేస్తే కరిగిపోయే బదామ్ కీ జాలీ వంటి సంప్రదాయ స్వీట్లు ఇందులో ఉండనున్నాయి. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే మహువా లడ్డూలు కూడా ఈ బాస్కెట్‌లో ఉంటాయి. విదేశీ అతిథులు సైతం మన వంటకాల రుచి చూసి ఫిదా అయ్యేలా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వీటిని తయారు చేయిస్తున్నారు.
మూడు హెలిప్యాడ్లు.. హైస్పీడ్ ఇంటర్నెట్
బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వంటి దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అగ్రగామిగా ఉన్న సుమారు 400 నుంచి 500 మంది సీఈవోలు సమిట్‌కు హాజరుకానున్నట్లు తెలుస్తున్నది. వీఐపీల భద్రత, రవాణా విషయంలో అధికారులు అత్యంత పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. ప్రముఖల కోసం ప్రత్యేకంగా మూడు హెలిప్యాడ్‌లను రెడీ చేశారు.
సదస్సు జరిగే ప్రాంగణంలో సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వేలాది మంది ఒకేచోట చేరనుండటంతో మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా నాలుగు అదనపు మొబైల్ సెల్ టవర్లను ఏర్పాటు చేయడంతోపాటు, ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా నిరంతర హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. లైవ్ స్ట్రీమింగ్, మీడియా కవరేజ్, డెలిగేట్స్ కమ్యూనికేషన్ కోసం బ్యాండ్ విడ్త్ సమస్య లేకుండా చూస్తున్నారు.
పగలు బిజినెస్ చర్చలు.. నైట్ లేజర్, డ్రోన్షోలు
పగలు సీరియస్ బిజినెస్ చర్చలతో సాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్.. రాత్రి వేళల్లో వినోద భరితంగా, కనులవిందుగా మారనుం ది. ఇందుకు లేజర్ షోలు, డ్రోన్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. వందలాది డ్రోన్లతో ఆకాశం లో తెలంగాణ మ్యాప్, సమిట్ లోగో, చారి త్ర క కట్టడాల ఆకృతులను ప్రదర్శించేలా ప్లాన్ చేశారు. సదస్సు ప్రాంగణంలో 40కిపైగా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఉత్పత్తులు, స్టార్టప్ కంపెనీల ఆవిష్కరణలు, ప్రభుత్వ పథకాల విజయాలను ప్రదర్శించనున్నారు. మన చేనేత, హస్తకళల స్టాల్స్ దీంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సదస్సుకు వచ్చే ప్రతినిధులు ఈ స్టాల్స్‌ను సందర్శించి, తెలంగాణ ప్రగతిని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఒకవైపు రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. మరోవైపు మన ఘనమైన చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం అనే ద్విముఖ వ్యూహంతో సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు.
