కలర్​ ప్రింట్ ​తీసి.. కరెన్సీగా చెలామణి

కలర్​ ప్రింట్ ​తీసి.. కరెన్సీగా చెలామణి

దొంగనోట్లు తయారు చేస్తున్న దంపతుల అరెస్ట్​
రూ.10.09 లక్షల ఫేక్​ కరెన్సీ స్వాధీనం

వరంగల్, వెలుగు: కరెన్సీ నోట్లను కలర్​ప్రింట్​తీసి మార్కెట్​లో చెలామణి చేస్తున్న దంపతులను వరంగల్ ​టాస్క్​ఫోర్స్, ఇంతేజార్​గంజ్ ​పోలీసులు బుధవారం అరెస్ట్​చేశారు. వారి నుంచి రూ.10,09,960 విలువైన నకిలీ నోట్లు, కలర్​ ప్రింటర్, బాండ్​పేపర్లు, కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్​ సీపీ డా. తరుణ్​జోషీ వెల్లడించారు. వరంగల్​నగరం కాశీబుగ్గ తిలక్​రోడ్డు ప్రాంతానికి చెందిన వంగరి రమేశ్, సరస్వతి భార్యాభర్తలు. రమేశ్​కాశీబుగ్గ ప్రాంతంలో చికెన్​సెంటర్​నడుపుతుండగా.. సరస్వతి ఫ్యాన్సీ దుకాణంతో పాటు మ్యారేజ్​బ్యూరో నిర్వహించేది. బిజినెస్​సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేక్​ కరెన్సీపై దృష్టి పెట్టారు. నకిలీ నోట్లు తయారు చేసి రద్దీ ప్రాంతాల్లో చెలామణి చేయాలని ప్లాన్​వేశారు. 
రష్​ ఏరియాల్లో మార్పిడి
ఫేక్​ కరెన్సీ తయారు చేయడానికి స్కానర్​తో కూడిన ప్రింటర్​ఒకటి కొనుగోలు చేశారు. దాంతోపాటు  కరెన్సీకి అవసరమైన బాండ్​పేపర్లను సమకూర్చుకున్నారు. తర్వాత అసలు కరెన్సీ  రూ.2 వేల నుంచి రూ. 10 వరకు అన్ని నోట్లను ముందుగా స్కాన్ చేశారు. తర్వాత ఆ నోట్లను కలర్​ప్రింట్​ చేసేవారు. వాటిని ఎవరికీ అనుమానం రాకుండా మార్చుకునేందుకు సిటీలోని రష్​ ఏరియాలను ఎంచుకునేవారు. ఇలా హన్మకొండ, వరంగల్​ ఏరియాల్లో రద్దీగా ఉండే షాపుల్లో నకిలీ నోట్లను చెలామణి చేసేవారు. కొద్దిరోజులుగా వరంగల్​ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో ఫేక్​నోట్లు చెలామణి అవుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో వరంగల్​ పోలీసులు అలర్ట్​ అయ్యారు. సీపీ తరుణ్​ జోషీ ఆదేశాల మేరకు టాస్క్​ఫోర్స్, ఇంతేజార్​గంజ్​పోలీసులు రంగంలోకి దిగారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు కాశీబుగ్గలోని రమేశ్​ఇంట్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఫేక్​ నోట్లను గుర్తించి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ నోట్లు ప్రింట్​ చేసేందుకు ఉపయోగించే ప్రింటర్​, రూ.2 వేల ఫేక్​నోట్లు 376, రూ.500 నోట్లు 204, రూ.200 నోట్లు 420, రూ.100 నోట్లు 471, రూ.50 నోట్లు 471, రూ.20 నోట్లు 62, రూ.10 నోట్లు 7 స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న దంపతులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సీపీ అభినందించారు.