ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క రాక 

ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క రాక 

ఒక దిక్కు జల జల పారుతున్న జంపన్నవాగు..

ఇంకో దిక్కు కన్నెపల్లి నుంచి కదిలొచ్చిన సారలమ్మ..

మరో దిక్కు పూనుగొండ్ల నుంచి ఎదుర్కొచ్చిన పగిడిద్దరాజు,

కొండాయి నుంచి తోల్కొచ్చిన గోవిందరాజు..వనమంతా మురిసిపోతున్నది...

 మేడారమంతా మెరిసిపోతున్నది.

రెండేండ్లకోసారి నాలుగు రోజులపాటు సాగే  మన, వన మహాజాతర షురూ అయింది. 

తలమీద బంగారం ముడుపులతో, సంకన పిల్లాపాపలతో ఇసుకపోస్తే రాలనంతగా భక్తులు మేడారం దిక్కు మునుంపట్టిన్రు.

 త్యాగాల అడవి తల్లుల చరిత్రను కైగట్టి పాడుతూ... గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నరు.

 ఇయ్యాళ చిలుకలగుట్ట నుంచి వచ్చే సమ్మక్క కోసం ఎదురుచూస్తున్నరు.

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి (మేడారం ), వెలుగు: శివసత్తుల సిగాలు, డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయనాదాలు, ఆటపాటల నడుమ కన్నెపల్లి నుంచి సమ్మక్క బిడ్డ సారలమ్మ బుధవారం రాత్రి 10:52 గంటలకు మేడారం గద్దెపైకి చేరుకుంది. ముఖాన ముసుగులు,  ప్రత్యేక వేషధారణలో ఎత్తిన తలను దించకుండా లయబద్దమైన అడుగులు వేస్తూ సారలమ్మను తెస్తున్న పూజారులను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. పూనుగొండ్ల నుంచి  పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజును కూడా పూజారులు రాత్రి 10:55 గంటలకు గద్దెలపైకి చేర్చారు. దీంతో నాలుగు రోజుల మేడారం మహాజాతర మొదలైంది.

మాఘ శుద్ధ పౌర్ణమి రోజు సారలమ్మను గద్దెలపైకి చేర్చే కార్యక్రమం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహిస్తారు. మేడారం గద్దెలకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామంలోని దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంది. బుధవారం ఉదయం పూజారులు సారలమ్మ గుడిలో, మేడారంలోని సమ్మక్క గుడిలో పూజలు చేశారు. సారలమ్మ పూజారులైన చందావంశీయులు కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక లక్ష్మీ బాయమ్మ, కాక కిరణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, కాక భుజంగరావు కన్నెపల్లిలోని గుడిలో పసుపు, కుంకుమ, సారె, చీరలతో పూజలు చేశారు. కన్నెపల్లిలోని తులసి చెట్టు ముందు పటం వేశారు. మధ్యాహ్నం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్దకు వచ్చి కూడా ప్రత్యేక పూజలు చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు డోలు వాయిద్యాలు, నృత్యాలతో కన్నెపల్లి ఆలయం మార్మోగిపోయింది. రాత్రి 7.10 గంటల సమయంలో ప్రధాన పూజారి కాక సారయ్య.. గుడి నుంచి మొంటె(వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు.  ప్రభుత్వం తరఫున ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య  సారలమ్మను ముందుండి తోడ్కొని రాగా, డీసీపీ సాయిచైతన్య బందోబస్తు నిర్వహించారు. ప్రధాన పూజారి కాక సారయ్యను ఎవరూ తాకకుండా 170 మంది రోప్‌‌‌‌‌‌‌‌ పార్టీ పోలీసులు రక్షణ చర్యలు తీసుకున్నారు. మార్గ మధ్యలో పూజారులు జంపన్నవాగులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. అక్కడ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల పూజారులంతా కలిసి పూజలు చేశారు. అనంతరం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రూపాలను  మేడారం గద్దెలపై చేర్చారు. పగిడిద్ద రాజును పెనక వంశీయులు, గోవిందరాజును దుబ్బకట్ల వంశీయులు పూజించడం, గద్దెలకు చేర్చడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి దుబ్బకట్ల గోవర్ధన్‌‌‌‌‌‌‌‌, పెనక బుచ్చిరామయ్య గిరిజన దేవుళ్లను మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో  ములుగు ఎమ్మెల్యే సీతక్క, డీఆర్వో రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

సమ్మక్క ఆలయంలో పూజలు

సారలమ్మ గద్దెకు చేర్చే అపూర్వ ఘట్టం సందర్భంగా మేడారంలోని సమ్మక్క ఆలయంలో కూడా పూజారులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క పూజారులు ఎంపల్లి మహేశ్‌‌‌‌‌‌‌‌, చందా బాబురావు, సిద్దబోయిన లక్ష్మణరావు, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునేందర్‌‌‌‌ ఉదయమే గుడికి వెళ్లి పసుపు, కుంకుమ, సారె, చీరలతో పూజలు చేశారు. సాయంత్రం సిద్ధబోయిన మునేందర్‌‌‌‌‌‌‌‌ ఇంటి నుంచి పూజారులు పసుపు, కుంకుమ తీసుకొని రోప్‌‌‌‌‌‌‌‌ పార్టీ పోలీసుల రక్షణలో మేడారంలోని గద్దెల వద్దకు చేరుకొని అక్కడ కూడా పూజలు చేశారు.
కోయ నృత్యం చేసిన కలెక్టర్‌‌‌‌, ఎమ్మెల్యే సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే క్రమంలో కన్నెపల్లి ఆలయంలో మహిళలు, యువతులతో కలిసి ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఆదిత్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, డీసీపీ సాయి చైతన్య కోయ నృత్యం చేశారు. జిల్లా పరిషత్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్​పర్సన్​  బడే నాగజ్యోతి, ఆర్డీవో రమాదేవి కూడా చేతులు కలిపి నృత్యం చేశారు. 

వరం పట్టిన భక్తులు

కన్నెపల్లి దేవాలయం నుంచి ప్రధాన పూజారి కాక సారయ్య సారలమ్మను తీసుకొని బయల్దేరగానే... పిల్లలు కావాలని కోరుకునే వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, అవివాహితులు గుడి ఎదుట తడి బట్టలతో వరం పట్టారు. పూజారులంతా వరం పడుతున్న వారిపై నుంచి నడుచుకుంటూ ముందుకు సాగారు. సారలమ్మే తమ పైనుంచి నడిచివెళ్తున్నట్టు భక్తులు పరవశించిపోయారు. కన్నెపల్లి గ్రామ మహిళలు మంగళహారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని సాగనంపారు. జంపన్నవాగు దాటుతున్నప్పుడు పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలికారు. 

నేడు సమ్మక్క ఆగమనం

మేడారం జాతరలో అద్భుత సన్నివేశంగా భావించే సమ్మక్క గద్దెలపైకి చేరే ఘట్టం గురువారం జరగనుంది. ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు, వడ్డెలు మేడారం సమీపంలో ఉన్న సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను తీసుకువచ్చేందుకు వెళ్తారు. భక్తులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతుండగా.. వడ్డె కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను భరిణె రూపంలో గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వన దేవతలు నలుగురు గద్దెలపైకి చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో భక్తులు మేడారం వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

భారీగా తరలొచ్చిన భక్తజనం

మహాజాతర ప్రారంభం కావడంతో బుధవారం మేడారం ప్రాంతంలోని జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్‌‌‌‌, కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం తదితర పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్యస్నానాలతో జంపన్నవాగు జనంతో నిండిపోయింది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెత్తాయి. మేడారం నలువైపులా కిలోమీటర్ల మేర దారులు వాహనాలు, భక్తులతో నిండిపోయాయి.