ఆర్టికల్​ 370  రద్దు చేసి తీరుతాం: అమిత్​ షా

ఆర్టికల్​ 370  రద్దు చేసి తీరుతాం: అమిత్​ షా
  • కాశ్మీర్ ‘స్పెషల్ ’ కాదు
  • ప్రెసిడెంట్ రూల్ ఎక్స్ టెన్షన్ కు ఆమోదం
  • ఈసీ గ్రీన్ సిగ్నలిస్తే అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధమన్న హోం మంత్రి

కాశ్మీర్​కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా మరోసారి స్పష్టం చేశారు. ప్రెసిడెంట్​ రూల్​ ఎక్స్​టెన్షన్​తోపాటు జమ్మూకాశ్మీర్​ రిజర్వేషన్ ​బిల్లుకు శుక్రవారం లోక్​సభ ఆమోదం తెలిపింది. వీటిని ప్రవేశపెడుతూ ​ షా ప్రసంగించారు.

న్యూఢిల్లీ:  ‘‘జమ్మూకాశ్మీర్​లో మూడో వంతు భూభాగం ఇండియాలో లేదు. ఒకప్పుడు కాశ్మీర్​లో ఇండియా పేరు వినిపించకపోయేది. స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా సైన్​బోర్డులో ‘ఇండియా’ పదం కనిపించకుండా జాగ్రత్త పడేవాళ్లు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?  దానికి కారణం కాంగ్రెస్​ పార్టీ, తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ కాదా? పాకిస్థాన్​పై ఇండియన్​ ఆర్మీ పైచేయి సాధించిన దశలో నెహ్రూ సడన్​గా కాల్పుల విరమణ ప్రకటించడం, ఆయన నిర్ణయాల వల్లే అక్కడ గత 70 ఏండ్లుగా కల్లోల పరిస్థితులు నెలకొనడం నిజం కాదా? ఇప్పటిదాకా జమ్మూకాశ్మీర్​లో 132 సార్లు ప్రెసిడెంట్​ రూల్​ పెడితే, అందులో 93 సార్లు కాంగ్రెస్​ హయాంలోనే జరిగిందని మర్చిపోయారా?” అని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ప్రశ్నించారు.

జమ్మూకాశ్మీర్​లో రాష్ట్రపతి పాలనను మరో ఆర్నెల్లు పొడిగించే తీర్మానాన్ని శుక్రవారం లోక్​సభలో ప్రవేశపెట్టిన ఆయన.. ప్రతిపక్ష కాంగ్రెస్​పై నిప్పులు చెరిగారు. వేల మంది మరణాలకు నెహ్రూ విధానాలే కారణమని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్​లో డెమోక్రసీని పునరుద్ధరించడం, టెర్రరిజాన్ని పారదోలడానికి బీజేపీ సర్కార్​ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రపతి పాలనలోనే అభివృద్ధి రెండింతలు పెరిగిందని, అంతమాత్రాన అసెంబ్లీ ఎన్నికలు జరుపకుండా ఉండలేమన్నారు. ఎలక్షన్​ కమిషన్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన మరుక్షణమే ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉన్నామన్నారు. కాశ్మీర్​కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసి తీరుతామని షా మరోసారి స్పష్టం చేశారు. ప్రెసిడెంట్​ రూల్​ ఎక్స్​టెన్షన్​ తీర్మానానికి లోక్​సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంపై కాంగ్రెస్‌‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పొలిటికల్​ ఫాయిదా కోసమే అసెంబ్లీ ఎన్నికలు వాయిదావేసి, ప్రెసిడెంట్​ రూల్​ కొనసాగిస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ మనీశ్ తివారీ విమర్శించారు. గతేడాది జూన్​లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన గడువు.. జులై 2తో ముగియనుండటంతో దాన్ని మరో ఆర్నెల్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కొద్దిరోజుల కిందట నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాశ్మీరియత్​ను కాపాడేది మేమే

జమ్మూకాశ్మీర్ విషయంలో ఇన్సానియత్ (మానవత్వం), జుమ్హారియత్​(ప్రజాస్వామ్యం), కాశ్మీరియత్(కశ్మీరీ కల్చర్​) అనే మూడు సూత్రాల ఆధారంగా అక్కడి ప్రజల మనసులు గెలవొచ్చన్న అటల్​ బిహారీ వాజపేయి ఆలోచనను మోడీ సర్కార్ అనుసరిస్తున్నదని, గత ఐదేండ్లలో జరిగిన అభివృద్ధే అందుకు నిదర్శనమని, రూ.2,307కోట్లతో సెక్యూరిటీ ప్రమాణాల్ని పెంచామని, నిర్ణీత కాలంలో 15వేల బంకర్లను నిర్మించామని అమిత్​ షా గుర్తుచేశారు. “ఇన్సానియత్​లో భాగంగానే కాశ్మీరీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పెద్ద సంఖ్యలో టాయిలెట్లు, 1.42లక్షల ఇండ్లు కట్టించాం.
ప్రజాస్వామ్యం విషయంలోనూ ఎవరికీ సందేహాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నికల హింసకు కేరాఫ్​గా ఉన్న జమ్మూకాశ్మీర్​లో దశాబ్దాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్ని, అదికూడా శాంతియుతంగా నిర్వహించగలిగాం. ఎలక్షన్​ కమిషన్​ ఎప్పుడు షెడ్యూల్​ ప్రకటించినా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. కలిసికట్టుగా ఉండటమే అసలైన కాశ్మీరియత్​(కాశ్మీరీ సంస్కృతి) తప్ప, దేశాన్ని విరోధించడం కాదు. గత ప్రభుత్వాలు వేల మంది పండిట్​లను వెళ్లగొట్టాయి. మేం వాళ్లకు పునరావాసం కల్పిస్తున్నాం. కశ్మీరియత్​ను కొంచెం కూడా డైల్యూట్​ కానివ్వం”అని అమిత్​ షా చెప్పారు.

మోడ్రన్ ఇండియా ఆర్కిటెక్ట్​ నెహ్రూనే..

జమ్మూకాశ్మీర్ పై చర్చ సందర్భంగా రివల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీ(RSP) ఎంపీ ఎన్ కే ప్రేమచంద్ ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. రిజర్వేషన్ బిల్లును సమర్థించి న ఆయన, ప్రెసిడెంట్ రూల్ ఎక్స్ టెన్షన్ ను వ్యతిరేకించారు. ఒకేసారి ఎన్నికల్ని సమర్థిం చే బీజేపీ..జమ్మూకాశ్మీర్ లో లోక్ సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోయిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని నెహ్రూపై అమిత్ షా కామెంట్లను ప్రేమచంద్ తప్పుపట్టారు . నెహ్రూ.. మోడ్రన్ ఇండియా ఆర్కిటెక్ట్​ అని, ప్రపంచంలోనేబెస్ట్​ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ ను అందించిన ఘనత కూడా ఆయనదేనని గుర్తుచేశారు.