AIతో ఉద్యోగాలు పోవు.. మరిన్ని వస్తాయి : టాటా చైర్మన్ చంద్రశేఖరన్

AIతో ఉద్యోగాలు పోవు.. మరిన్ని వస్తాయి : టాటా చైర్మన్ చంద్రశేఖరన్

అందరూ భయపడుతున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భారతదేశంలో ఉద్యోగాలు పోవని, బదులుగా ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని టాటా చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ఇది తక్కువ నైపుణ్యం లేదా నైపుణ్యం లేని ఎక్కువ మందిని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి అవకాశమిస్తుందని చెప్పారు. B20 సమ్మిట్ ఇండియాలో పాల్గొన్న చైర్ ఎన్ చంద్రశేఖరన్.. భారతదేశం టెక్నో-లీగల్ విధానాన్ని అవలంబించడం ద్వారా డేటా గోప్యత, రక్షణకు సంబంధించి అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో గోప్యత, ఉద్యోగాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించాలని కోరుతూ, “వాస్తవానికి మనలాంటి దేశంలో, AI ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఎందుకంటే ఇది తక్కువ నైపుణ్యం లేదా నైపుణ్యం లేని వ్యక్తులను శక్తివంతం చేస్తుంది. వారికి సమాచార నైపుణ్యం అందుతుంది. తద్వారా వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయగలరు" అని చంద్రశేఖరన్ ఒక నర్సును ఉదాహరణగా చెప్పారు. AI ప్రభావం వివిధ మార్కెట్‌లలో, సమాజంలోని వివిధ విభాగాలలో భిన్నంగా ఉంటుందని చెప్పారు.

మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కారణంగా రాబోయే కాలంలో మానవుల ఆయుర్దాయం దీర్ఘకాలం ఉంటుందని ఊహిస్తూ, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకోవడానికి పెద్ద శ్రామికశక్తి అవసరాన్ని కూడా చంద్రశేఖరన్ నొక్కిచెప్పారు. రానున్న రోజుల్లో AI మరింత ఉపయోగపడుతుంది, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు. ప్రతిచోటా AI.. ఉద్యోగాలను సృష్టించబోతోందన్న ఆయన.. ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయడానికి ప్రజలను ప్రేరేపితం చేస్తుందని చెప్పారు.