
- 30 నుంచి 40 ఎకరాల్లో ఏర్పాటు చేసే యోచన
- మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ప్లాన్
- కొత్వాల్ గూడ సమీపంలో స్థల పరిశీలన
- అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మూసీ రివర్ డెవలప్ మెంట్ లో భాగంగా మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో తొలిసారి ఆర్టిఫిషియల్ లేక్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. నగరంలోని కొత్వాల్ గూడ సమీపంలో 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ లేక్ నిర్మించనుండగా.. టూరిజం శాఖ అడ్వైజర్ గా వ్యవహరించనున్నది.
అయితే, ఆర్టిఫిషియల్ లేక్ నిర్మాణానికి పలు అంతర్జాతీయ సంస్థలు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. రూ.225 కోట్ల నిధులతో దీనిని నిర్మించనున్నారు. ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు సాహస క్రీడలు, జంపింగ్, సెయిలింగ్, స్కేటింగ్, విశ్రాంతి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.
రూ.15 వేల కోట్ల కొత్త పెట్టుబడులే లక్ష్యం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు, బిజినెజ్ టూరిజంలో హైదరాబాద్ ను నంబర్ వన్లో నిలిపేందుకు పర్యాటక ప్రణాళికలు రూపొందించింది. రాబోయే ఐదేండ్లలో పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడం, 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఇందులో భాగంగా మెడికల్, కస్టమైజ్డ్, ఫిలిం టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా వినోదం, ఆతిథ్య రంగాలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ లేక్, బీచ్ లపైనా ఫోకస్ పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సర్వే కూడా పూర్తి చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది డిసెంబరులోగా పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. లేక్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సైతం రెడీ చేసింది. బడ్జెట్ అంచనాలు రూ.225 కోట్లు ఉన్నా.. ఇంకా వ్యయం పెరిగే అవకాశం ఉంది.