
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇప్పటికీ మరచిపోని వారు చాలా మందే ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క తలపై కొబ్బరికాయలు కొట్టే సీన్ స్క్రీన్ పై చూసేందుకే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. అలాంటిది ప్రత్యక్షంగా చూస్తే ఎలా ఉంటుంది...? ఈ తరహా ఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది. తమ ఇష్టదైవం ముందు పూజారులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. దీనికే టెంకాయ పవాడం అని పేరు. పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం బీరగాని కురప్పల్లి గ్రామంలో కురవ కులస్తుల తమ ఆరాధ్య దైవం నిడిగుంట బీర లింగేశ్వర స్వామి శ్రీ ఉజ్జయిని రాయస్వామి వసరాయ స్వామి వారి దేవతా మహోత్సవం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారికి మహా మంగళ పూజలతో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సమయంలో పూజారుల తలలపై టెంకాయ పవాడం కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో పూజారుల తలపై టెంకాయలు పగులుతుంటే తెలుగు సినిమా అరుంధతి సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. దైవ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపడతామని నిర్వాహకులు చెప్పారు. ఈ మహోత్సవాలు సోమవారంతో ముగుస్తాయని తెలిపారు.
అయితే మామూలుగా ఇలాంటి సీన్స్ కేవలం ఊహల్లోనో, లేదంటే సినిమాల్లోనో చూడడం అందరికీ తెలిసిందే. కానీ ఇలా బయట కూడా జరుగుతుందా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజుకో టెక్నాలజీతో ప్రపంచంలో పెను మార్పులు చోటుచేసుకుంటుంటే ఇలాంటి ఆచారాలు, నమ్మకాలు ఇంకా ఉన్నాయా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.