ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమైందని రుజువైంది

ఢిల్లీలో ఆపరేషన్ కమలం విఫలమైందని రుజువైంది

ఢిల్లీ అసెంబ్లీలో జ‌రిగిన విశ్వాస ప‌రీక్ష‌లో అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ స‌ర్కార్ విజ‌యం సాధించింది. విశ్వాస ప‌రీక్ష‌లో 59 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. 70 మంది స‌భ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గైర్హాజరైన ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు విదేశాల్లో ఉండగా..మూడో వ్యక్తి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారు. 

ఆపరేషన్ కమలం విఫలమవుతుందని నిరూపించేందుకు ఢిల్లీ  అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చామని కేజ్రీవాల్ అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభాలకు లొంగరని..బీజేపీ కుట్రలను అర్థం చేసుకున్నారన్నారు. ఆప్  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కమలదళం వేసిన ఎత్తులను చిత్తు చేశామన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికి కేంద్రం వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యిందని కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోడీ, సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై దాడి తర్వాత గుజరాత్ లో ఆప్ కు 4 శాతం ఓట్లు పెరిగాయన్నారు. మనీష్ సిసోడియాను అరెస్ట్  తర్వాత అది 6 శాతంకు చేరుకుందన్నారు. డిప్యూటీ సీఎంను రెండుసార్లు అరెస్ట్ చేస్తే తాము గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

గతవారం 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసిందని, పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం అవినీతి, మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రాజకీయ ప్రచారానికి, అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చిందని బీజేపీ నిప్పులు చెరిగింది.