ఎంసీడీని అవినీతిరహితంగా తీర్చిదిద్దుతాం : అరవింద్ కేజ్రీవాల్

ఎంసీడీని అవినీతిరహితంగా తీర్చిదిద్దుతాం  : అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం పై  సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న  కేజ్రీవాల్... తమకు బీజేపీ, కాంగ్రెస్ సహకారం కావాలన్నారు. ఈ సారి మహిళను మేయర్ ను చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఇక ఇది మాకు కేవలం విజయం మాత్రమే కాదని ఇదో పెద్ద బాధ్యతని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు.  మొత్తం 250 వార్డుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 స్థానల్లో గెలిచి విజయం సాధించింది. బీజేపీ 104 సీట్లు గెలవగా కాంగ్రెస్ తొమ్మిది సీట్లను గెలుచుకుంది. 


ఢిల్లీలో 15 ఏళ్లుగా బీజేపీ అధికారం చేపడుతూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ కంచుకోటను  ఆప్ బద్దలుకొట్టింది. ఢిల్లీలోని 250 వార్డులకు డిసెంబర్ 4న జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 శాతం ఓటింగ్ నమోదు కాగా, మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1958లో ఏర్పాటైన ఎంసీడీ (MCD)ని 2012లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు.  ఎంసీడీగా పునరుద్ధరించిన తరువాత ఇదే మొదటి ఎన్నికలు కావడం గమనార్హం.