ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా...ఈ సారి కారణం ఏంటంటే?

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా...ఈ సారి కారణం ఏంటంటే?

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)   నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో విచారణ కోసం డిసెంబర్ 21న తమ ముందు హాజరుకావాలని ఈడీ తన నోటీసులో స్పష్టం చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  అయితే కేజ్రీవాల్ ఇవాళ ఈడీ విచారణకు హాజరుకారని తెలుస్తోంది. 

ఎందుకంటే కేజ్రీవాల్  బుధవారం (డిసెంబర్ 20) విపాసన కార్యక్రమానికి బయల్దేరినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ ప్రతియేటా మెడిటేషన్ కోర్సుకు వెళుతుంటారు. ఈ కార్యక్రమం దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఆయన ఈ సారి ఎక్కడికి వెళ్లారనేది వెల్లడించలేదు.   ఈ ప్రోగ్రాం షెడ్యూల్ ప్రకారమే  చేశామని.. అది తెలిసి కూడా కుట్రపూరితంగా ఈడీ సమన్లు పంపిందని ఆ పార్టీ ఎంపీ రాఘవ చద్దా తెలిపారు. 

ఢిల్లీ లిక్కర్ కేసులో  కేజ్రీవాల్ ను మొదటి సారి ఏప్రిల్ లో సీబీఐ 9 గంటల పాటు విచారించింది. ఈ కేసులో  నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ నోటీసులు పంపింది. అయతే అప్పట్లో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఉందని హాజరు కాలేదు. దీంతో డిసెంబర్ 21న హాజరుకావాలని మళ్లీ  ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆప్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారని ఆప్ నేతలు భావిస్తున్నారు.