ఆర్యన్‌‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో కిడ్నాప్ కోణం ఉంది

ఆర్యన్‌‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో కిడ్నాప్ కోణం ఉంది
  • మహారాష్ట్ర మంత్రి నవాబ్‌‌ మాలిక్‌‌ కొత్త వాదన
  • గోసావి సెల్ఫీతోనే కుట్ర బయటపడ్డదని కామెంట్

ముంబై: క్రూయిజ్ షిప్‌‌లో డ్రగ్స్‌‌ కేసులో ఇరికించేందుకు షారూఖ్‌‌ ఖాన్‌‌ కొడుకు ఆర్యన్‌‌ ఖాన్‌‌ను కిడ్నాప్ చేశారని ఆదివారం మహారాష్ట్ర మంత్రి నవాబ్‌‌ మాలిక్‌‌ కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు.కిడ్నాప్‌‌ ఉదంతంలో ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్‌‌‌‌ సమీర్ వాంఖడే పాత్ర కూడా ఉందన్నారు. కేసులో సాక్షి కేపీ గోసావి సెల్ఫీతోనే ఇదంతా బయటికి వచ్చిందన్నారు. సబర్బన్‌‌ ఓషివర శ్మశానం వద్ద వాంఖడేను బీజేపీ నేత భారతీయ కలిశారని చెప్పారు. ‘‘వాంఖడే అదృష్టం కొద్దీ అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీ పనిచేయలేదు. ఆర్యన్‌‌ను కిడ్నాప్ చేసి డబ్బులు పొందడానికే క్రూయిజ్ షిప్‌‌ పార్టీని ప్లాన్ చేశారు. దీని వెనుక ఉన్నది మోహిత్‌‌ భారతీయ మాస్టర్‌‌‌‌ మైండ్‌‌. షారూఖ్‌‌ఖాన్ ముందుకు వచ్చి అన్యాయంతో పోరాడుతున్న నాకు సపోర్ట్ చేయాలి. మోహిత్‌‌ బావమరిది రిషభ్‌‌ సచ్‌‌దేవ్‌‌ ఆర్యన్‌‌ను ట్రాప్ చేశాడు. రూ.25 కోట్లు డిమాండ్ చేశారు. రూ.18 కోట్లకు డీల్‌‌ కుదిరింది. రూ.50 లక్షలు ఇచ్చారు. సాక్షి కేపీ గోసావి సెల్ఫీతో డీల్‌‌ నాశనం అయ్యింది” అని మాలిక్ పేర్కొన్నారు.  కాగా, మాలిక్‌‌పై వాంఖడే తండ్రి ధ్యానేశ్వర్ పరువు నష్టం దావా వేశారు. మంత్రి కామెంట్ల కారణంగా తన ఫ్యామిలీ పరువు పోతోందని ఆరోపిస్తూ 1.25 కోట్లకు బాంబే హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. మరోవైపు కేసు విచారణను ఎన్సీబీ స్పీడప్‌‌ చేసింది. ఈ కేసులో నిందితులను ఆదివారం విచారణకు రావాలని సమన్లు ఇవ్వగా ఆర్యన్ హాజరు కాలేదు.