వనదేవతలకు భక్తుల ముందస్తు మొక్కులు.. మేడారంకు భారీగా తరలివస్తున్న జనం..

 వనదేవతలకు భక్తుల ముందస్తు మొక్కులు..  మేడారంకు భారీగా తరలివస్తున్న జనం..

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తుండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శనివారం ఉదయం తెల్లవారుజాము నుంచే ప్రైవేటు వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి తరలివచ్చారు. ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి జంపన్న నాగులమ్మ, గద్దెల వద్దకు వెళ్లి సంతానం కోసం ముడుపులు కట్టారు. అనంతరం కళ్యాణకట్టలో తలనీలాలు ఇచ్చాక.. నిలువెత్తు బెల్లంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ చీరె సారే, ఒడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మేడారం సమీప శివరాంసాగర్, జంపన్న వాగు, ఆర్టీసీ బస్టాండ్, చిలుకల గుట్ట తదితర ప్రాంతాల్లో వంటా వార్పు చేసుకుని భోజనాలు చేశారు. పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చినట్టు ఎండోమెంట్ ఈవో వీరస్వామి తెలిపారు.