భద్రాద్రి జిల్లాలో..మహిళా, యూత్ ఓటర్లపై ఫోకస్

 భద్రాద్రి జిల్లాలో..మహిళా, యూత్ ఓటర్లపై ఫోకస్
  •     వీరిని తమవైపు తిప్పుకునేందుకు లోక్ సభ అభ్యర్థుల పాట్లు
  •     భద్రాద్రి జిల్లాలో బూత్ లెవల్  వివరాల సేకరణ
  •     వృద్ధులు, దివ్యాంగ, పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా ప్రధాన దృష్టి 
  •     నజరానాలతో గాలం వేసేందుకు క్యాండిడేట్ల పాట్లు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా భద్రాద్రి జిల్లాలో  మహిళా, యూత్  ఓటర్లపైనే అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. జిల్లాలో అధికంగా వీరి ఓట్లే ఉన్నాయి. దీంతో  లోక్ సభకు పోటీ చేసే అన్ని పార్టీల  అభ్యర్థులు ఆయా వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకునే విధంగా పావులు కదుపుతున్నారు.  జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 9,84,906 మంది ఓటర్లు ఉన్నారు.

ఇందులో అధికంగా 5,06,165 మంది మహిళా ఓటర్లు ఉండగా..  2,19,158 మంది యువ ఓటర్లు ఉన్నారు. కొత్తగా 18 – -19  ఏండ్ల మధ్య వయసువారు 23,186 మంది , 20 –29 ఏండ్ల మధ్య1,95,972, వీరితో పాటు 30 – 39 ఏండ్ల మధ్యవారు 2,65,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో యూత్ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పార్టీలు బూత్​ లెవెల్​ నుంచి వివరాలను సేకరిస్తున్నాయి. 

జోరందుకున్న పార్టీల ప్రచారం

లోక్​సభకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి షురువైంది. దీంతో పార్టీల ప్రచారం కూడా జోరందుకుంది.  ఖమ్మం, మహబూబాబాద్​లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మం లోక్​సభ పరిధిలో జిల్లాలో కొత్తగూడెం, అశ్వారావుపేట, మహబూబాబాద్​లోక్​సభ పరిధిలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

ఆయా సెగ్మెంట్ల ఓటర్లపై లోక్​ సభకు పోటీ చేసే అభ్యర్థులు దృష్టి పెట్టారు. మహిళా, యువ, ఉద్యోగులు, దివ్యాంగ, వృద్ధులు, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల  వివరాలను సేకరించే పనిలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం ఓటర్లలో  4,78,685 మంది పురుష, 5,05,165 మహిళ,  56 మంది థర్డ్​జెండర్​ఓటర్లు ఉన్నారు.  

వృద్ధులు, దివ్యాంగ, పోస్టల్​ ఓట్లపై టార్గెట్ 

 ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అభ్యర్థులు టార్గెట్ చేశారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు పాట్లు పడుతున్నారు.  ఇందులో భాగంగా ఉద్యోగుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇంటి నుంచి ఓట్లు వేసే వృద్ధులు, దివ్యాంగులతో పాటు పోస్టల్​ఓట్లు ఎక్కువగా తమకు పడేలా ఆయా పార్టీల నేతలు ప్లాన్​చేస్తున్నారు.

వారికి అవసరమైన నజరానాలు ఇచ్చేందుకు మంతనాలు కూడా సాగిస్తుండడం గమనార్హం. ఇంటి నుంచి ఓటు వేసే వృద్ధ, దివ్యాంగ ఓటర్ల ఓటు హక్కు కోసం కొందరు లీడర్లు దగ్గరుండి దరఖాస్తులు చేయిస్తున్నారు.  

ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీ

ఆర్టీసీ బస్సుల్లో ‘మహాలక్ష్మి’ స్కీమ్ కింద ఫ్రీ  జర్నీ, రూ. 200 యూనిట్ల లోపు కరెంట్​ఫ్రీ పాటు గ్యాస్​ధర సగం తగ్గించడంతో ప్రధానంగా మహిళలు కాంగ్రెస్​ వైపు ఉన్నారు. ఇల్లెందు నియోజకవర్గ స్థాయి మహిళా కార్యకర్తల మీటింగ్​ను నాలుగు రోజుల కిందట నిర్వహించి మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 5 సెగ్మెంట్లలో కాంగ్రెస్​ బలంగా ఉంది.  ప్రధానంగా మహిళా ఓటర్లు కాంగ్రెస్​ కు మద్దతిస్తున్నారు.

దీంతో వారిని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళ్తోంది.  తెలంగాణ సెంటిమెంట్​తో ఓట్లను దండుకునేందుకు బీఆర్ఎస్​ అభ్యర్థులు కూడా స్కెచ్​వేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో యువ, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో కాంగ్రెస్​, బీజేపీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి.