
- ఆహారం, ఆవాసం కోసం ఊర్లు, రోడ్ల మీదికి..
- కరెంట్ షాక్‌లు, ప్రమాదాలతో మృత్యువాత
- అడవులు తగ్గడమే కారణం
- కొండలు, గుట్టల్లో మైనింగ్ మాఫియాతో
- దెబ్బతింటున్న జంతువుల ఆవాసాలు
హైదరాబాద్, వెలుగు: అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులుల సంచారం ఇటీవల చాలా పెరిగింది. నిత్యం ఎక్కడో చోట కలకలం సృష్టిస్తున్నాయి. పొలాల్లో విద్యుత్ షాకులకు గురవుతూ, రోడ్లపై వాహనాలు ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. కొన్నిచోట్ల రాత్రిపూట ఇండ్లల్లోకి వచ్చి పెంపుడు జంతువులపై ఎటాక్ చేస్తున్నాయి. అడవుల విస్తీర్ణం రోజు రోజుకూ తగ్గిపోతుండడం వల్లే చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాల విస్తరణ, పోడు వ్యవసాయం కోసం అడవులను నరకడం, మైనింగ్, అడవుల వెంబడి రోడ్ల నిర్మాణం, అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోవడం వంటి అనేక కారణాల వల్ల జనావాసాల్లో చిరుతల సంచారం పెరిగిందని వివరిస్తున్నారు.
మాయమైతున్న గుట్టలు
చిరుతలు.. కొండలు, గుట్టల్లో తమ ఆవాసాలను ఏర్పర్చుకుంటాయి. బండ రాళ్ల మధ్య ఉంటూ వేటను కొనసాగించి.. జీవితాన్ని గడుపుతాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ చిరుతలు ఉన్నాయి. అయితే, రాష్ట్రంలో జనాభా పెరుగుతుండడంతో, ఇందుకు అనుగుణంగా పట్టణాలు, పల్లెల విస్తరణ కూడా పెరుగుతోంది. గ్రామాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీ కోసం అటవీ ప్రాంతాల గుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో చిరుతలు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. ఓ చోటు నుంచి మరో చోటికి తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. గత పదేండ్లుగా రాష్ట్రంలో కొండలు, గుట్టలను గ్రానైట్ కోసం ఇష్టమొచ్చినట్టు తవ్వేశారు.
రాష్ట్రంలో వేల సంఖ్యలో గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. గ్రానైట్ మాఫియాతో గుట్టలకు గుట్టలే మాయమవుతున్నాయి. దీంతో ఆ కొండల్లో, గుట్టలో నివసించే చిరుతలు, గుడ్డేలుగులు తమ నివాసాలను కోల్పోతున్నాయి. అడవుల్లో మట్టి తవ్వకాల మాఫియా కూడా భారీగా జరుగుతోంది. ఈ మట్టి, గ్రానైట్ తరలింపు కోసం అడవుల్లోకి రోడ్లు వేస్తున్నారు, భారీ శబ్దాలతో పగలు, రాత్రి వాహనాలను నడిపిస్తున్నారు. ఇవన్నీ చిరుతలు తమ ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి రావడానికి కారణాలు అని అధికారులు చెబుతున్నారు. అడవుల్లో శాఖాహార జంతువుల సంఖ్య తగ్గిపోవడం కూడా చిరుతలు జనావాసాల్లోకి రావడానికి ఓ కారణమేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అడవి పందులు, కుందేళ్లు, జింకలు వంటి చిన్న చిన్న జంతువులను వేటాడటం ద్వారా చిరుతలు తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ, అడవుల్లో ఆ చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలకు ఆహారం దొరకడం లేదు. దీంతో అవి జనావాసాల్లోకి వచ్చి ఇండ్లల్లో ఉన్న పెంపుడు జంతువులను వేటాడుతున్నాయి. ఆవాసాలను కోల్పోయిన చిరుతలు, మరో ఆవాసం కోసం వెతుక్కునే క్రమంలో జనాల కంటపడుతున్నాయి.
అడవుల్లో మనుషుల యాక్టివిటీ పెరిగింది
మానవ అవసరాలు, డెవలప్‌మెంట్ కోసం పల్లెలు, పట్టణాలు విస్తరిస్తున్నాయి. రకరకాల కారణాలతో అడవుల్లో మనుషుల యాక్టివిటీ పెరిగింది. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం, చదును చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పనులతో చిరుతలు, ఇతర జంతువులు తమ ఆవాసాలను కోల్పోతున్నాయి. షెల్టర్, ఆహారం వెతుక్కునే క్రమంలో జనావాస ప్రాంతాల్లోకి, రోడ్ల మీదకు వస్తున్నాయి. చిరుతలు సాధారణంగా మనుషులపై దాడులు చేయవు. వాటికి ఏదైనా హాని కలిగిస్తే, వాటిని ఆందోళనకు గురిచేస్తేనే అవి ఎటాక్ చేస్తాయి. ఒకవేళ చిరుత కనిపిస్తే హడావుడి చేయకుండా, దానికి దూరంగా, సైలెంట్‌గా ఉండాలి. అప్పుడు అది తన దారిన వెళ్లిపోతుంది. అలా చేయకుండా దాన్ని కొట్టేందుకు ప్రయత్నించినా.. గట్టిగా శబ్దాలు చేసినా ఆందోళనకు గురవుతుంది. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో దాడులు చేస్తుంది. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చిరుతలు కనిపిస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇస్తే, దాన్ని పట్టుకుని అడవుల్లో వదిలేస్తున్నాం.
- మోహన్ చంద్ర పర్గేయిన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్)