ఇండియా క్యాన్సర్​ క్యాపిటల్!?

ఇండియా క్యాన్సర్​ క్యాపిటల్!?

హార్ట్, డయాబెటిస్, బీపీ వంటి వాటితో పోలిస్తే క్యాన్సర్ అనేది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రాణాంతక రోగం. డయాబెటిస్, టీబీ, క్యాన్సర్ వంటివి ప్రపంచంలో కంటే ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. జనాభా ఇండియాలో ఎక్కువ కాబట్టి రాబోయే రోజుల్లో క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగని ఇండియా క్యాన్సర్​ క్యాపిటల్ అయిపోయింది అనే స్టడీ ఎంతవరకు నిజం అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఆ స్టడీ కొంత పరిధిలో మాత్రమే జరిగింది. అందుకని ఆ రిపోర్ట్​ని ఇండియా మొత్తానికి వర్తింపచేయకూడదు. 

రాబోయే కొన్నేండ్లలో ఇండియా క్యాన్సర్​కి క్యాపిటల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది వాళ్ల ఉద్దేశం కావచ్చు. కాకపోతే అది తప్పుగా ఇప్పటికే ఇండియా క్యాన్సర్​కి క్యాపిటల్​ అయిపోయిందని ప్రచారం అవుతోంది. ఆ స్టేట్​మెంట్ తప్పు కావచ్చు. అలాగని అది తీసి పారేసే రిపోర్ట్​ కాదు. అందులోనూ కొంత నిజం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనదేశంలో ఎక్కువమంది మధ్య వయసులో ఉన్నారు. ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ కారకాలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇదంతా స్క్రీనింగ్ లేకుండానే చెప్పగలం’’ అంటున్నారు డాక్టర్ యుగంధర్. 

యూఎస్​, యూకే దేశాల్లో సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్​నెస్ ఉంది. అక్కడ నూటికి 80 శాతం మంది స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లోనే ప్రతి ఏటా పాప్​స్మియర్ టెస్ట్ చేస్తారు. ఇండియాలో అది ఒక శాతం మాత్రమే ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చూసినా మూడు లేదా నాలుగు శాతం ఉంటుంది. గవర్నమెంట్, ప్రైవేట్ ఆసుపత్రుల తరపున చేస్తేనే మన దగ్గరఈ పరిస్థితి ఉంది. 

ఎందుకు పెరిగాయి?

క్యాన్సర్ రోగులు ఎక్కువ అవుతున్నారు. అందుకు కారణం ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఎక్సర్​సైజ్ లేకపోవడం. హెల్దీ ఫుడ్ తినకపోవడం. తినే, తాగే వాటిలో, గాలిలో ఉన్న పొల్యూషన్‌. ప్లాస్టిక్ వాడకం. వీటితోపాటు తక్కువ ఆదాయ దేశాలు, లో మిడిల్ ఇన్​కమ్ వచ్చే దేశాల జాబితాలో మనదేశం కూడా ఉంది. ప్రజల్లో అవగాహన లేక ఈ దేశాల్లోనే క్యాన్సర్​ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. క్యాన్సర్​ బారిన పడేందుకు ఇవన్నీ కారణాలే. జన్యు పరంగా వచ్చేది నూటికి 5 శాతమే. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు కారణాలు తెలియకుండా వస్తాయి. అవి కూడా చాలావరకు లైఫ్ స్టయిల్​తో ముడిపడినవే. మధ్య వయసు వాళ్లకు వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. 

ప్రపంచంలో లంగ్ క్యాన్సర్‌ కేసులు కూడా ఎక్కువే. ఈ క్యాన్సర్​కి స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ కారణాలు.  క్యాన్సర్​ వల్ల చనిపోయే వాళ్లలో లంగ్ క్యాన్సర్ల వాళ్ల శాతమే ఎక్కువ. అదే ఇండియాలో చూసుకుంటే హెడ్​ అండ్ నెక్ క్యాన్సర్‌‌ ఎక్కువ.​ పొగాకు ఉత్పత్తులైన పాన్, గుట్కా, సిగరెట్, బీడీ వంటి వాటివల్ల ఈ క్యాన్సర్ వస్తుంది.