లెటర్​ టు ఎడిటర్ ​అనర్హులకు ఆసరా!

లెటర్​ టు ఎడిటర్ ​అనర్హులకు ఆసరా!

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఆసరా పథకం ప్రజల కోసం కాకుండా ప్రభుత్వానికే ఆసరాగా మారిందనిపిస్తోంది. ఇప్పటికే ఆసరా పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందుతున్నారు.  ఇటీవల కాంగ్రెస్ పార్టీ సైతం అధికారమే లక్ష్యంగా ఆసరా పెన్షన్లని రూ.4,000 కి పెంచుతామని ప్రకటించగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 4,016 కి పెంచి జులై నుంచి అమలు కూడా ప్రారంభించారు. ఆసరా పథకం ప్రజలకి ఆసరాగా ఉంటుందో  లేదో కానీ కేసీఆర్​ సర్కారుకు మాత్రం రోజు రోజుకీ ఓటు బ్యాంకు పెంచుకుంటూ ఆసరాగా నిలుస్తోందని చెప్పొచ్చు.  

రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరుకోవడంతో బీఆర్ఎస్ తమ ఓటు బ్యాంకును సైతం అంతకు నాలుగు రెట్లు పెంచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్​ పార్టీ ఎలాగైనా తిరిగి అధికారంలో కొనసాగడానికి ఆసరా పథకాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మలచుకుంటున్నాయి. అర్హులైన వారికి ఈ పథకం అందిస్తే..వారికి చేయూత అందిస్తే కాదనేవారు ఉండరు. 

రాజకీయ లబ్ధి కోసం ఆసరా పథకాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవడంపైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇప్పటికైనా అర్హులైన లబ్ధిదారులను ఆదుకొని అనర్హులను తొలగించాలి. అమలు సాధ్యం కాని పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చినప్పుడు సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందడాన్ని అరికట్టడానికి కోర్టులు జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వానికి ఓటు బ్యాంక్​గా మారిన ఆసరా పథకంలో అనర్హుల్ని తొలగిస్తేనే అసలైన లబ్ధిదారులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తదితరులకు న్యాయం లభిస్తుంది. 

-పసునూరి శ్రీనివాస్ మెట్​పల్లి, జగిత్యాల జిల్లా