ASAT వ్యర్ధాలతో ISS కు ముప్పు: నాసా

ASAT వ్యర్ధాలతో ISS కు ముప్పు: నాసా

గత బుధవారం అంతరిక్షంలో ఇస్రో శాస్త్రవేత్తలు సుమారు 300 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఓ ఉపగ్రహాన్ని యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌తో పేల్చేశారు. ఐతే ఈ ప్రయోగ పరీక్ష పెద్ద ప్రమాదంగా మారిందని అమెరికాకు చెందిన నాసా తెలిపింది. యాంటీ శాటిలైట్‌తో ఉపగ్రహాన్ని పేల్చడంతో సుమారు 400 వ్యర్ధాలు తయారైనట్లు నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. ఈ వ్యర్ధాలతో  ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, భవిష్యత్‌లో అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే ప్రయోగాలను నిర్వహించలేమని నాసా హెచ్చరించింది. ఇప్పటివరకు పది సెంటీమీటర్ల సైజు కన్నా పెద్దగా ఉన్న వ్యర్ధాలను మాత్రమే ట్రాక్‌ చేస్తున్నామని నాసా తెలిపింది. ఐతే ప్రతి వ్యర్థాన్ని లెక్కగట్టడం సులువు కాదని నాసాకు చెందిన జిమ్‌ బ్రిడెన్‌స్టయిన్‌ తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ తిరుగుతున్న కక్ష్య కన్నా దిగువ కక్ష్యలోనే భారత్‌ ఓ శాటిలైట్‌ను పేల్చింది. ఉపగ్రహాలు ఆ కక్ష్య కన్నా పైనే తిరుగుతున్నాయి. సుమారు 24 వ్యర్ధాలు స్పేస్‌ స్టేషన్‌ ఎగువ కక్ష్యలో పేరుకుపోయినట్లు కూడా నాసా చెప్పింది. సుమారు 24 వ్యర్థాలు స్పేస్‌ స్టేషన్‌ కన్నా ఎగువ కక్ష్యలో పేరుకపోయినట్లు నాసా తెలిపింది. 2007లో చైనా నిర్వహించిన యాంటి శాటిలైట్‌ పరీక్షతో సుమారు మూడు వేల వ్యర్థాలు ఉత్పన్నమైనట్లు నాసా చెప్పింది. తాజాగా భారత్‌ నిర్వహించిన పరీక్ష కారణంగా స్పేస్‌ స్టేషన్‌కు ప్రమాదం జరిగే అవకాశాలు మరింత పెరిగాయన్నారు. అంటే పది రోజుల్లో ఈ వ్యర్ధాల వల్ల సుమారు 44 సార్లు స్పేస్‌ స్టేషన్‌కు ప్రమాదం సంభవించే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యర్ధాలు భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోయే కొద్దీ ఈ ముప్పు తగ్గిపోతుందని స్పష్టం చేశారు.