- భూపాలపల్లి ఏరియాలో ప్రయోగం సక్సెస్
- రోజుకు1200 టన్నులు వినియోగం
- తగ్గుతున్న ఖర్చుల భారం
- పెరిగిన ఆదాయంతో పాటు బొగ్గు ఉత్పత్తి
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : బొగ్గు బావుల్లో బ్యాక్ ఫిల్లింగ్(స్టోవింగ్)కు భూపాలపల్లి ఏరియాలో గనుల్లో తొలిసారిగా బూడిదను వాడుతున్నారు. ఇసుక కొరతతో స్టోవింగ్ నిలిచి గనుల్లో బొగ్గు తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా సింగరేణి ఆఫీసర్లు బూడిదతో నింపుతూ సమస్య కు చెక్ పెట్టి సక్సెస్ అయ్యారు. రెండు నెలలుగా గనుల్లో బూడిదతో స్టోవింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బొగ్గు ఉత్పత్తి జరిగిన ప్రాంతాల్లో బూడిదను నింపుతున్నారు. తద్వారా రెండు నెలలుగా రోజుకు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరిగిందని సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు.
బూడిదతో గనుల్లో స్టోవింగ్
భూపాలపల్లి ఏరియాలోని1,5,6 ఇంక్లైన్లో బొగ్గు తవ్వకాలు జరిపిన తర్వాత ఉండే ఖాళీ ప్రదేశాల్లో బంకర్ల ద్వారా బూడిదను నింపుతున్నారు. 53 మైక్రాన్(మిల్లిమీటర్ కన్న తక్కువ ) పరిమాణంలో ఫిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు గనుల స్టోవింగ్ కు ఇసుక వాడుతుండగా..వానాకాలంలో కొరతతో పాటు రేటు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా బూడిదను వినియోగిస్తున్నారు. గనులకు సమీపంలోని కేటీపీపీ నుంచి బాటమ్యాష్ను ప్రతి రోజు1400 క్యూబిక్ మీటర్లు(1200టన్నులు) తీసుకుంటున్నారు. ఒక వంతు బూడిదకు రెండొంతుల నీటిని కలిసి బంకర్ల ద్వారా ఫిల్చేస్తున్నారు.
తగ్గిన భారం.. పెరిగిన ఉత్పత్తి
బొగ్గు తవ్విన గనుల్లో బూడిదను నింపుతుండడంతో సింగరేణికి నిధుల భారం భారీగా తగ్గుతోంది. ప్రస్తుతం ఇసుక కొరతతో పాటు రేటు కూడా టన్నుకు రూ. 1000 వరకు ఉండడంతో పాటు సమయానికి అందుబాటులో ఉండడం లేదు. దీంతో కార్మికులు, మెషీన్లు ఉన్నా బ్యాక్ ఫిల్లింగ్ లేక బొగ్గు తవ్వకాలు నిలిచిపోతున్నాయి. ఇసుకకు ప్రత్యామ్నాయంగా బూడిదతో ఫిల్లింగ్ను చేసేందుకు కసరత్తు చేపట్టింది.
కేటీపీపీ నుంచి బూడిద తెచ్చి బ్యాక్ ఫిల్లింగ్ కు శ్రీకారం చుట్టింది. భూపాలపల్లి ఏరియాలో తొలిసారిగా గనుల స్టోవింగ్ కు బూడిదను వాడుతుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. దీన్ని టన్నుకు రూ. 247 కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఖర్చు తగ్గడంతో పాటు ఇన్‌టైంలో గనుల ఫిల్లింగ్ కంప్లీట్ చేస్తుండగా ఉత్పత్తి పెరుగుతున్నట్లు ఆఫీసర్లు తెలుపుతున్నారు. బూడిద వాడకంతో సింగరేణికి రూ. కోట్లల్లో భారం తగ్గడంతో పాటు టార్గెట్ మేరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. రెండు నెలలుగా గనుల్లో స్టోవింగ్ చేస్తుండడంతో గతంలో 1,400 టన్నుల ఉన్న బొగ్గు ఉత్పత్తి కాగా.. ప్రస్తుతం 2,000 టన్నులకు చేరిందని ఆఫీసర్లు చెబుతున్నారు.
మరో పీవోబీ ప్లాంట్ కు డీపీఆర్ రెడీ
ఇప్పటికే గనుల్లో స్టోవింగ్ కు ఓసీ నుంచి వెలువడే వ్యర్థాల నుంచి కృత్రిమ ఇసుకను తయారు చేసే పీవోబీ(ప్రాసెస్ఓవర్బర్డన్) ప్లాంట్ నడుస్తోంది. ఇది పూర్తిస్థాయిలో ఇసుకను అందించకపోతుండడంతో ప్రత్యామ్నాయంగా బూడిదను వాడుతున్నారు. మరో పీవోబీ ప్లాంట్ ఏర్పాటుకు డీపీఆర్రెడీ అయిందని టెండర్లు కూడా పిలిచినట్లు ఆఫీసర్లు తెలుతున్నారు. రెండో ప్లాంట్ స్టార్ట్ అయితే ఇసుక కొరతను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు.
బూడిద వాడకంతో తగ్గిన ఖర్చు
గనుల్లో బ్యాక్ ఫిల్లింగ్ కు బూడిద వాడుతుండడంతో సంస్థకు రూ. కోట్లలో ఖర్చు తగ్గింది. మరోవైపు సత్ఫలితాలు వస్తున్నాయి. రెండు నెలలుగా ఎప్పటికప్పుడు ఫిల్లింగ్ ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. దీంతో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. గతంలో ఫిల్లింగ్ చేయడంలో ఇసుక లేక కొంత లేట్ అయ్యేది. దీంతో కార్మికులు, మెషీన్లు ఉండి కూడా ఉత్పత్తికి ఆటంకాలు వచ్చేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇసుక కొరతను అధిగమించాం. రానున్న రోజుల్లో మరిన్ని భూగర్భ గనులను బ్యాక్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. - రాజేశ్వర్‌రెడ్డి, జీఎం, భూపాలపల్లి
