
అశోక్ గల్లా, శ్రీ గౌరిప్రియ జంటగా కొత్త దర్శకుడు ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం ‘విసా : వింటారా సరదాగా’.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శనివారం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను ఇందులో చూపించారు. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి కలిగించింది.
ఇందులో ‘విసా’పేరుతో పాడ్‌కాస్టింగ్ నడిపే యువకుడిగా అశోక్ గల్లా స్టైలిష్‌గా కనిపించాడు. ‘ఆంధ్రా, తెలంగాణ తర్వాత తెలుగు వాళ్లు బాగా కనెక్ట్ అయిన స్టేట్.. యూనిటైడ్ స్టేట్స్’అంటూ పాడ్ కాస్ట్ ద్వారా తన ప్రేమ కథను చెబుతాడు. ‘బరువును పౌండ్స్‌లో, దూరాన్ని మైల్స్‌లో, తేదీని రివర్స్‌లో రాసే దేశం.. కానీ అక్కడైనా, ఇక్కడైనా తప్పని తప్పించుకోలేని ప్రోబ్లమ్ ఒకటి ఉంది.
అదే ప్రేమ’అని హీరోయిన్ శ్రీ గౌరిప్రియతో తన ప్రేమాయణం ఎలా సాగిందో ఇందులో చూపించిన విధానం ఆకట్టుకుంది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫారిన్ లొకేషన్స్‌లోని విజువల్స్‌తో పాటు విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.