ఎమ్మెల్యేలకు లెటర్‌‌ రాసిన అశోక్‌ గెహ్లాట్‌

ఎమ్మెల్యేలకు లెటర్‌‌ రాసిన అశోక్‌ గెహ్లాట్‌
  • నిజం వైపు నిలబడండి అని పిలుపు

జైపూర్‌‌/న్యూఢిల్లీ: ఎన్నో మలుపులు తిరిగిన రాజస్థాన్‌ రాజకీయంలో అసెంబ్లీ సమావేశాలు కీలకం కానున్నాయి. ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఎమ్మెల్యేలకు మూడు పేజీల లెటర్‌‌ రాశారు. ఆ లెటర్‌‌లో కరోనా మహమ్మారి, రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ప్రస్తావించారు. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి తదతరులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారని, కానీ వాళ్లంతా ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నించలేదని అన్నారు. “ మీరంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఓటర్లు మనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని కోరుతున్నాను. మీరంతా ప్రజల వాయిస్‌ వినాలి. మీ కుటుంబసభ్యులు, ఓటర్ల మనోభావాలను గౌరవిస్తూ దయచేసి ఓటర్లు ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీరంతా నిజంవైపు నిలబడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చేందుకు సహకరిస్తారనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. ఈ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో మనమంతా జనాల ప్రాణాలు కాపాడేందుకు, ఎకానమీని గాడిలో పెట్టేందుకు, ఉద్యోగాలు సృష్టించేందుకు కష్టపడాలి. దాని కోసం ప్రభుత్వం పగలు రాత్రి కష్టపడుతూనే ఉంది. కానీ అపోజిషన్‌ లీడర్లు, మన పార్టీలోని కొంత మంది సహచరులే ఇబ్బందులకు గురిచేయడం మన దురదృష్టం’’ అని అశోక్‌గెహ్లాట్ లెటర్‌‌లో పేర్కొన్నారు. గెలుపు ఓటములు అనేవిఎలక్షన్‌ సైకిల్స్‌ అని, కానీ ప్రజలు ముఖ్యం అని అన్నారు. అంతే కాకుండా ఆదివారం రోజు అశోక్‌ గెహ్లాట్‌ మరో ట్వీట్‌ చేశారు. “ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మా ఈ పోరాటం. ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కచ్చితంగా గెలుస్తాం. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. ప్రజలు గెలుస్తారు. ప్రభుత్వాన్ని పడేయకూడదు అనే ఎమ్యెల్యేలంతా కచ్చితంగా గెలిచి తీరుతారు” అని ఆయన ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత, రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ సొంత పార్టీపైన తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్‌లో రాజకీయంలో అనిశ్చితి నెలకొంది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలంతా గత నెల రోజుల నుంచి రిసార్ట్‌లోనే ఉంటున్నారు. కాగా.. ఈ నెల14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.