
1994 తరహా సంక్షోభం రావొచ్చు
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నరు
హరీశ్, ఈటల, జగదీశ్ మౌనం వీడాలి
మీడియాతో ఆర్టీసీ జేఏసీ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: దివంగత సీఎం ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ మేధావా? అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం కాకపోతే 1994 తరహా సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదని, ఎంతో మంది ఆ పదవిలో ఉండిపోయారని అన్నారు. 1994 సంక్షోభాన్ని కేసీఆర్ మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రజాస్వామ్య పునాదులు కదులుతున్నాయని, ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ బంధువు విఠల్ రావు కుమారుడు సందీప్‌కు 45 బస్సులు అప్పగించారని, వాళ్లదే రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. మేధావులు మౌనం ప్రమాదకరమని, మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి మౌనం వీడాలని ఆయన కోరారు. సమ్మెకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కొంత మంది మంత్రులు బయట ఆర్టీసీ కార్మికులను విమర్శించి.. ఇంటికి వెళ్లిన తర్వాత ఏడుస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఆర్టీసీ జేఏసీ నేతలను కర్నాటక ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు టీఎంయూ కార్యాలయంలో కలిసి మద్దతు తెలిపారు.