- జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జియో మార్ట్ సెంటర్లలో ఎక్స్‌పైరీ సరుకులు
- ఫుడ్ సేఫ్టీ దాడుల్లో బయటపడ్డ ఈ-కామర్స్ గోదాముల బాగోతం
- రెండ్రోజుల్లో 75 చోట్ల దాడులు..1,903 యూనిట్ల సరుకులు సీజ్
- కుళ్లిన కూరగాయలు, పాచిపోయిన ఫుడ్ పారబోయించిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: కేవలం 10 నిమిషాల్లో డెలివరీ అని మురిసిపోతున్నరా? ఆన్ లైన్ ఆఫర్లని ఎగబడి ఆర్డర్లు పెడుతున్నరా? అయితే జర భద్రం. ఎందుకంటే.. మీ ఇంటికి వచ్చేది ఫ్రెష్ స్టాక్ కాదు.ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన సరుకులు. కుళ్లిపోయిన కూరగాయలు కావొచ్చంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.రాష్ట్రంలోని ప్రముఖ ఈ-కామర్స్ గోదాములపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ నెల 25, 26 తేదీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ-కామర్స్ సంస్థల అసలు బాగోతం బటపెట్టారు. జెప్టో, జియో మార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ ఇన్ స్టా మార్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల గోదాముల్లో నిర్వహించిన తనిఖీల్లో ఫ్రెష్ సరుకులకు బదులు పాతవి ఉన్నట్లు తేల్చారు. వాటినే అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.
ఎక్స్ పైరీ సరుకులు.. లేబుల్ లేని ప్యాకెట్లు
ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా 75 వేర్‌హౌస్‌ల్లో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గడువు తీరిపోయిన, లేబుల్స్ సరిగా లేని, తప్పుదోవ పట్టించే లేబుల్స్ ఉన్న 1,903 యూనిట్ల ఫుడ్ ఐటమ్స్ ను గుర్తించి సీజ్ చేశారు. అంతేకాదు, ఆన్ లైన్ లో ఫ్రెష్ అని బోర్డు పెట్టి అమ్ముతున్న 76 కిలోల కుళ్లిన కూరగాయలు, పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే చెత్తబుట్టలో పారేయించారు.
ఇందులో ఎక్కువగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే 25 గోదాములున్నాయి. ఈ దాడుల్లో రూల్స్ బ్రేక్ చేస్తున్న 32 సంస్థలకు ఇంప్రూవ్ మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఓ సంస్థకు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
హైదరాబాద్‌లోనే ఎక్కువ..
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ డ్రైవ్ జరగ్గా.. ఒక్క హైదరాబాద్ లోనే పరిస్థితి దారుణంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 25 గోదాములను తనిఖీ చేశారు. మొత్తం 39 ఎన్ ఫోర్స్‌మెంట్ శాంపిల్స్, 44 సర్వైలెన్స్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్ కు పంపారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 98 ఎన్ ఫోర్స్ మెంట్, 124 సర్వైలెన్స్ శాంపిల్స్ సేకరించారు.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అధికారుల దాడులు కొనసాగాయి. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ-కామర్స్ సంస్థలను అధికారులు హెచ్చరించారు. ఆన్ లైన్ ఆర్డర్లు చేసేముందు జనం కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.
