- రూ. 8.50 లక్షల నగదు, 4 కార్లు, 2 బైకులు, బొలెరో, 11 మొబైల్స్, 13 సిమ్ కార్డులు స్వాధీనం
- మీడియాకు వివరాలు వెల్లడించిన గద్వాల
ఎస్పీ శ్రీనివాసరావుగద్వాల,వెలుగు: మాజీ సర్పంచ్ హత్య కేసును గద్వాల జిల్లా పోలీసులు తేల్చారు. సంచలనం సృష్టించిన ఘటనపై దర్యాప్తు చేసి కారుతో ఢీకొట్టి చంపేశారని నిర్ధారించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. కేటీ దొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడికి, మిల్లు వీరన్నకు మధ్య రాజకీయ కక్షలు ఉన్నాయి. అదేవిధంగా భూమి పంచాయితీలు, రైస్ మిల్లుపై కేసులు, తన వ్యాపారానికి అడ్డొస్తున్నాడని, ఎలాగైనా భీమా రాయుడిని చంపించాలని మిల్లు వీరన్న ప్లాన్ చేశాడు. సుపారి గ్యాంగ్ తో రూ. 25 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని, మొదట రూ. 8 లక్షలు చెల్లించాడు.
చిన్న భీమా రాయుడిని చంపేందుకు సుపారి గ్యాంగ్ యత్నిస్తుంది. ఈనెల 21న సాయంత్రం గద్వాలలో పని ముగించుకొని నందిన్నెకు బైక్ పై చిన్న భీమా రాయుడు వెళ్తున్నాడు. ధరూర్ మండలం జాంపల్లి బస్టాప్ సమీపంలో చిన్న భీమారాయుడిని వెనక నుంచి సుపారి గ్యాంగ్ బొలెరోతో ఢీకొట్టడంతో స్పాట్ లో చనిపోయాడు. మృతుడి అన్న పెద్ద భీమారాయుడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేశారు. హత్యలో 11 మంది నిందితులను గుర్తించి, 10 మందిని అరెస్టు చేశారు. మరొకరు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య గౌడ్ పరారీలో ఉన్నారు.
ప్రధాన నిందితుడు మిల్లు వీరన్న, కురువ సురేందర్, బోయ వీరన్నతోపాటు సుపారి గ్యాంగ్ లోని పంచలింగాలకు చెందిన మధుబాబు, తాండ్రపాడుకు చెందిన తెలుగు కృష్ణ, మదనపల్లికి చెందిన సంజీవులు, పోలకల్ కు చెందిన సుంకన్న, బైరి కేశన్న, నందిన్నెకు చెందిన ప్రభు స్వామి, పుట్ట పాశం గ్రామానికి చెందిన హరిజన్ రాజేశ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ. 8.50 లక్షల నగదు, 4 కార్లు, 2 బైక్ లు, బొలెరో, 11 మొబైల్స్ 13 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. ఈ ప్రెస్ మీట్ లో డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీనివాసులు, ధరూర్ ఎస్ఐ శ్రీహరి తదితరులు ఉన్నారు.
