- బీఆర్ఎస్ హయాంలోనే వైద్య విద్య ఆగం: దామోదర
హైదరాబాద్, వెలుగు: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ పేపర్ల వాల్యుయేషన్‌లో తప్పు జరిగినట్టు నిరూపితమైతే ఎవరినీ ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.
గురువారం ‘ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణ వైద్య విద్య పూర్తిగా ఆగమైందని దామోదర ఆరోపించారు. టీచింగ్ ఫాకల్టీ, ల్యాబ్స్ వంటి కనీస సౌలతులు లేకుండానే మెడికల్ కాలేజీలు నడిపి విద్యను నాసిరకంగా మార్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే వందల సంఖ్యలో ఫాకల్టీ, వేల సంఖ్యలో నర్సింగ్ స్టాఫ్ నియమించామన్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పీజీ పేపర్ల వాల్యుయేషన్‌పై ఆరోపణలు వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించామని. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
