రాజన్న ఆలయానికి భద్రత పెంపు..అదనంగా 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది నియామకం

రాజన్న ఆలయానికి భద్రత పెంపు..అదనంగా 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది నియామకం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్‌‌, 29 మంది హోంగార్డ్స్‌‌తో భద్రత కల్పిస్తుండగా.. గురువారం మరో 12 మంది ఎస్పీఎఫ్‌‌ సిబ్బంది విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారు స్వామిని దర్శించుకొని ఆయుధ పూజ చేశారు. సిబ్బందికి ఈవో రమాదేవి స్వామి వారి ప్రసాదం అందజేశారు. 

వీరంతా మూడు షిఫ్ట్‌‌ల్లో విధులు నిర్వర్తించనున్నారు. రాజన్న ఆలయంలో ఇప్పటికే విస్తరణ, అభివృద్ధి పనులు స్పీడ్​గా కొనసాగుతుండగా భీమేశ్వర ఆలయంలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. భీమేశ్వర ఆలయంలో ఇటీవల భక్తుల రద్దీ పెరిగిపోవడంతో అదనంగా సిబ్బందిని కేటాయించారు. నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌.. నుంచి భారీగా తరలివస్తుంటారు. 

ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎఫ్ కమాండెంట్ సి.జంగయ్య, ఎస్సైలు డి.తిరుపతిరెడ్డి, సీహెచ్ మహేందర్, ఆలయ పర్యవేక్షకుడు రాజేందర్, గొట్టం గిరి, తదితరులు  పాల్గొన్నారు.