- జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు తమ విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు పి.రవికుమార్, కె.రాజ్‌కుమార్ తో కలిసి ఆమె గురువారం ఎన్నికల వ్యయ వివరాల నమోదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉల్లంఘనలు, నగదు, మద్యం పంపిణీ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో నోడల్ అధికారులు శేషాద్రి, భారతి, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.
రుద్రంగిలో చెక్ పోస్ట్, ఆర్వో సెంటర్ తనిఖీ
చందుర్తి, వెలుగు : జిల్లా సరిహద్దులో రుద్రంగి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్‌ను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం రుద్రంగి లో ఏర్పాటు చేసిన ఆర్‌వో సెంటర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్ పాల్గొన్నారు.
