పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొదటి దశ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి జోష్లో ఉన్న కాంగ్రెస్.. అదే ఊపుతో లోకల్ బాడీలనూ క్లీన్ స్వీప్చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మెజారిటీ గ్రామ పంచాయతీలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ హైకమాండ్ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలతోపాటు మండల స్థాయి నేతలను రంగంలోకి దించింది.
గ్రామాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాంటివారినే తమ అభ్యర్థులుగా నిలిపి గెలిపించుకోవాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో మంత్రులు, డీసీసీబీ చైర్మన్లు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు రంగంలోకి దిగి, మండలాలవారీగా ఆశావహులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రెబల్స్బెడద లేకుండా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏకాభిప్రాయం సాధించేలా చర్చలు జరుపుతున్నారు. అవకాశం ఉన్నచోట ఏకగ్రీవాలకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు పార్టీ తరఫున 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందడంతో ఆ సామాజిక వర్గాలవారికి పెద్దపీట వేస్తున్నారు.
ఇందుకోసం మండలాలవారీగా బీసీల జాబితాలను రెడీ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, సన్నవడ్ల బోనస్, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళా సంఘాలకు వ్యాపారాలు, విరివిగా రుణాలు, వడ్డీ చెల్లింపు తదితర సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి ఓట్లు అడిగేందుకు సిద్ధమవుతున్నారు.
