IND vs ENG 5th Test: అశ్విన్ విజృంభణ..ధర్మశాల టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్

IND vs ENG 5th Test: అశ్విన్ విజృంభణ..ధర్మశాల టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్

ధర్మశాల టెస్టు మూడో రోజే ముగియడం ఖాయంగా కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ లోనూ దూకుడు ప్రదర్శిస్తుంది. చక చక వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజ్ లో రూట్ (34), ఫోక్స్(0) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 156 పరుగులు వెనకబడి ఉంది.

భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తుంది.ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్లకు 473 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇండియా మరో నాలుగు పరుగులు చేసి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5,  జేమ్స్ అండర్సన్, టామ్ హర్ట్లీలకు చెరో రెండు వికెట్లు, బెన్ స్టోక్ కు ఒక  వికెట్ పడ్డాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం దక్కలేదు. 

100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ఇంగ్లాండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. క్రాలే, డకెట్, పోప్ వికెట్లను తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లో పడేశాడు. ఈ దశలో జానీ బెయిర్ స్టో ఎదురు దాడికి దిగాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లో 39 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. లంచ్ కు ముందు ఓవర్లో అశ్విన్ స్టోక్స్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. భారత బౌలర్లలో అశ్విన్ కు నాలుగు, కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ తీసుకున్నారు.