సెమీకండక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి వెళ్తాం : అశ్వినీ వైష్ణవ్

సెమీకండక్టర్లను ఎగుమతి చేసే స్థాయికి వెళ్తాం : అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ: మనదేశం 2029 నాటికి సెమీకండక్టర్ల డిమాండ్‌‌‌‌ను తీర్చడమే కాకుండా వాటిని ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని,  ఏడాదిలో రూ.300 కోట్ల సెమీకండక్టర్ చిప్‌‌‌‌లను తయారుచేస్తుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్,  ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.  మన అవసరాలలో గణనీయమైన భాగం భారతదేశంలో తయారు అవుతుందని అన్నారు. మొబైల్ ఫోన్‌‌‌‌లను ఎగుమతి చేసినట్లే చిప్​లను కూడా ఎగుమతి చేస్తామని వైష్ణవ్​వివరించారు.  

దేశంలో సెమీకండక్టర్ తయారీకి సంబంధించి ప్రస్తుతం సుమారు  26 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారం ప్రకటించిన రూ. 1.3 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ (ఫ్యాబ్) తయారీ ప్రాజెక్టులు సహా 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. గుజరాత్‌‌‌‌లో రూ. 22,500 కోట్లతో ఏర్పాటవుతున్న మైక్రో సెమీకండక్టర్ ప్లాంట్ తయారు చేసిన తొలి చిప్ ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లో రానుంది.