- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సాగుతున్న అక్రమ ప్రచారాల దందా
- బెట్టింగ్, బ్యూటీ, హెల్త్ యాడ్లతో ఫాలోవర్లను బురిడీ కొట్టిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు
- క్లినికల్ ఆధారాలు లేకుండానే రోగాలు నయం చేస్తామంటూ అసత్య ప్రచారాలు
- ఏఎస్సీఐ పరిశీలనలో బయటపడిన షాకింగ్ నిజాలు
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్‌ఫోన్‌లో స్క్రోల్ చేసే సోషల్ మీడియా ఫీడ్స్ మోసాలకు కేరాఫ్‌గా మారాయి. కంటికి ఇంపుగా కనిపించే రంగు రంగుల ప్రకటనలు, నోరూరించే ఆఫర్లు, అసాధ్యమైన వాగ్దానాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) హెచ్చరించింది. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు దేశవ్యాప్తంగా వెలువడిన ప్రకటనలపై ఏఎస్సీఐ తన వార్షిక నివేదికను విడుదల చేసింది.
ఈ ఏడాది సంస్థ మొత్తం 11,581 కేసులను నిశితంగా పరిశీలించగా, అందులో ఏకంగా 9,841 ప్రకటనలు పచ్చి అబద్ధాలని నిరూపితమైంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వస్తున్న ప్రకటనల్లో 97 శాతం నిబంధనలను అతిక్రమించి, వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని రిపోర్టులో తేల్చిచెప్పింది. గతేడాదితో పోలిస్తే ఇలాంటి తప్పుడు ప్రచారాలపై వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 21 శాతం పెరగడం గమనార్హం.
తప్పుడు ప్రకటనలకు కేరాఫ్ సోషల్ మీడియా
ప్రస్తుతం యాడ్స్ దందా అంతా డిజిటల్ రూపంలోకి మారడంతో సోషల్ మీడియా మోసగాళ్లకు అడ్డాగా మారింది. డిజిటల్ మాధ్యమాల్లో వస్తున్న ప్రకటనల్లో 82 శాతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో వచ్చే స్పాన్సర్డ్ యాడ్స్ కాగా, మిగిలినవి కంపెనీల సొంత వెబ్‌సైట్లు, ఖాతాల్లో వస్తున్నవే. ప్లాట్‌ఫామ్‌ల వారీగా చూస్తే.. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారానే అత్యధికంగా 79.84 శాతం ఫేక్ ప్రచారాలు సాగుతున్నాయి. ఆ తర్వాత వెబ్‌సైట్లు (13.64%), గూగుల్ (3.59%), లింక్డ్‌ఇన్ (0.96%) ఉన్నాయి. ఎక్స్ (ట్విట్టర్), టెలిగ్రామ్, గేమింగ్ చాట్ యాప్‌ల ద్వారా కూడా తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఇందులో యువతను పక్కదారి పట్టిస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ దందా వాటానే 72.14 శాతంగా (6,933 యాడ్స్) ఉండటం కలకలం రేపుతోంది. ఇవి చట్టవిరుద్ధమని తెలిసినా, వందల కొద్దీ డొమైన్లను, ప్రాక్సీ సైట్లను మారుస్తూ జనాన్ని జూదానికి బానిసలుగా చేస్తున్నాయి. ఈ డిజిటల్ యాడ్స్‌లో 98 శాతం రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించిన ఏఎస్సీఐ.. కొన్నింటిని మార్చాలని, మరికొన్నింటిని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ఫాలోవర్లను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు
పర్సనల్ ఎక్స్పీరియన్స్ పేరుతో డబ్బుల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోయర్లను నిండా ముంచుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లకు సంబంధించిన మొత్తం 1,609 ప్రకటనలను పరిశీలించగా, అందులో 97.3 శాతం మంది నిబంధనలను బ్రేక్ చేసినట్లు తేలింది. వీరిలో 54 శాతం మంది బెట్టింగ్, మద్యం వంటి నిషేధిత ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. గతేడాది ఇన్‌ఫ్లుయెన్సర్ల ఉల్లంఘనలు 69 శాతంగా ఉండగా, ఈ ఏడాది ఏకంగా 76 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 869 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు చట్టవిరుద్ధమైన ప్రకటనలు చేస్తూ పట్టుబడ్డారు.
వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి నకిలీ 'బిఫోర్-ఆఫ్టర్' ఫోటోలను సృష్టించి సౌందర్య సాధనాలు, ఆరోగ్య ఉత్పత్తులపై అశాస్త్రీయ వాగ్దానాలు చేస్తున్నారు. పర్సనల్ కేర్ రంగంలో 90 శాతం ప్రకటనలు ఇలాంటివే ఉన్నాయి. క్లినికల్ ఆధారాలు లేకుండా డయాబెటిస్, లివర్ వ్యాధులను నయం చేస్తామంటూ, కంప్లీట్ బ్రెయిన్ న్యూట్రిషన్ పేరిట తల్లిదండ్రుల ఆందోళనను ఆసరాగా చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారని రిపోర్టు వెల్లడించింది.
రియల్ ఎస్టేట్ రంగంలోనూ అంతే..
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇలాంటి అక్రమ ప్రకటనలు బయటపడ్డాయి. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీఆర్ఈఆర్ఏ), ఏఎస్సీఐ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం జరిపిన తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో తెలంగాణలో వెలువడిన 629 రియల్ ఎస్టేట్ ప్రకటనలు నిబంధనలు పాటించలేదని తేలింది. ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం, తప్పుడు లాభాల ఆశ చూపడం, అద్దె ఆదాయం కచ్చితంగా వస్తుందంటూ అసత్యపు వాగ్దానాలతో రియల్టర్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రకటనల ప్రపంచం అంతా మాయాజాలంగా మారిందని, వినియోగదారులు జర భద్రంగా ఉండాలని ఏఎస్సీఐ సీఈఓ మనీషా కపూర్ సూచించారు. ఏవైనా ప్రకటనలు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ascionline.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీల మాటలను గుడ్డిగా నమ్మి ఆరోగ్యానికి, జేబుకు నష్టం చేసుకోవద్దని, కొనుగోలుకు ముందే క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఆరా తీయాలని స్పష్టం చేశారు.
