ఆసియా కప్కు వరుణుడి సెగ.. మ్యాచ్‌ల వేదికలు మార్పు..!

ఆసియా కప్కు వరుణుడి సెగ.. మ్యాచ్‌ల వేదికలు మార్పు..!

ఆసియాకప్ 2023లో  టీమ్స్తో పాటు..గెలుపు కోసం వరుణుడు పోటీ పడుతున్నాడు. అన్ని జట్లు వర్సెస్..వర్షం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మ్యాచులో వరుణుడే గెలుపొందాడు. ఈ నేపథ్యంలో టోర్నీలో జరిగే మిగతా మ్యాచుల్లో  వరుణుడు తన ప్రతాపాన్ని చూపెట్టే ఛాన్స్ ఉంది.  ఈ క్రమంలోనే మ్యాచుల వేదికలను మార్చే యోచనలో ఉంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. 

ఆసియాకప్ 2023లో సూపర్ 4 మ్యాచులన్నీ కొలంబో వేదికగా జరగనున్నాయి. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 9 వరకు సూపర్ 4 మ్యాచులు మొదలవుతాయి. సెప్టెంబర్ 17వ తేదీ  ఫైనల్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరగనుంది.  అయితే ఈ సమయాల్లో కొలంబోలో భారీ వర్షాలు పడతాయని అక్కడి వాతావరణ కేంద్రం ప్రకటించింది.  

వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్  సూపర్-4 మ్యాచ్‌ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబో వేదికగా జరగాల్సిన అన్నీ మ్యాచ్‌లను దంబుల్లా లేదా పల్లెకెలెలకు తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

ఆసియాకప్ సూపర్ 4 మ్యాచులన్నీ..దంబుల్లాలోనే నిర్వహించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు..ఆసియా క్రికెట్ కౌన్సిల్కు సూచించింది. కానీ ఆసియా కప్  అధికారిక బ్రాడ్‌కాస్టర్, టోర్నీలో పాల్గొనే జట్లు దంబుల్లాలో  మ్యాచ్‌ల నిర్వహణను వ్యతిరేకించాయి. ఆటగాళ్ల ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తుతాయని అభ్యంతరం తెలిపాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో  కొలంబోలో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒప్పుకుంది. కానీ ప్రస్తుతం వానల వల్ల సూపర్ 4 మ్యాచులన్నీ కొలంబో నుంచి మార్చే అవకాశం ఉంది.   సూపర్ -4 మ్యాచ్‌ల ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. వేదికల మార్పుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.