నేటి(ఆగస్టు30) నుంచి ఆసియా కప్‌.. నేపాల్‌‌‌‌తో పాకిస్తాన్‌‌‌‌ ఢీ

నేటి(ఆగస్టు30) నుంచి ఆసియా కప్‌.. నేపాల్‌‌‌‌తో పాకిస్తాన్‌‌‌‌ ఢీ
  • ఇండియా-పాక్‌‌‌‌ మూడుసార్లు  పోటీ పడే చాన్స్‌‌‌‌
  • నేడు నేపాల్‌‌‌‌తో పాకిస్తాన్‌‌‌‌ ఢీ
  • మ. 3 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో

ముల్తాన్​/ కొలంబో:  ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ మధ్య  ఏడాదికి ఒక్క మ్యాచ్‌‌‌‌ జరిగితేనే  ఫ్యాన్స్​ ఆసక్తిగా  చూస్తుంటారు.  ఇప్పుడు రెండు వారాల్లో మూడు సార్లు ఇండో–పాక్‌‌‌‌ వార్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ను  అలరించనుంది. బుధవారం మొదలయ్యే  ఆసియా కప్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ ఇందుకు వేదిక కానుంది. ముల్తాన్​లో జరిగే ఆరంభ మ్యాచ్‌‌‌‌లో నేపాల్‌‌‌‌తో ఆతిథ్య పాకిస్తాన్‌‌‌‌ పోరు ఆరంభించనుంది.  ఇంకో నెల రోజుల్లో స్టార్టయ్యే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌నకు ప్రిపేర్‌‌‌‌ అయి, తమ జట్లను సిద్ధం చేసుకునేందుకు ఆసియా దేశాలు ఈ టోర్నీని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. నేపాల్‌‌‌‌ మినహా  టోర్నీలో పోటీ పడుతున్న ఐదు జట్లు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ కు క్వాలిఫై అయ్యాయి. అక్టోబర్‌‌‌‌ 5న మొదలయ్యే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ముందు తమ జట్లలోని సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది సరైన వేదిక కానుంది. 

వాళ్లపై ఇండియా ఫోకస్‌‌‌‌

అత్యధికంగా ఏడుసార్లు చాంపియన్‌‌‌‌గా నిలిచిన ఇండియా ఈసారి కూడా ఫేవరెట్‌‌‌‌ హోదాలో బరిలోకి దిగుతోంది. గతేడాది టీ20 ఫార్మాట్‌‌‌‌లో యూఏఈలో జరిగిన టోర్నీలో  పాక్‌‌‌‌, శ్రీలంక చేతిలో ఓడి గ్రూప్‌‌‌‌ దశలోనే వైదొలిగిన టీమిండియా ఈసారి కచ్చితంగా టైటిల్‌‌‌‌ నెగ్గాలని ఆశిస్తోంది. గత ఓటములకు పాక్‌‌‌‌, లంకపై ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది. కప్పు కంటే ముఖ్యంగా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌నకు ఇండియా టీమ్‌‌‌‌ను రెడీ చేసుకోవాలని కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్న కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌‌‌‌లకు దూరంగా ఉంటున్నాడు. ప్రాక్టీస్‌‌‌‌లో అతని బ్యాటింగ్‌‌‌‌బాగానే ఉన్నప్పటికీ మరో చిన్న దెబ్బ తగలడంతో వికెట్‌‌‌‌ కీపింగ్‌‌‌‌కు తను పూర్తి సిద్ధంగా కనిపించడం లేదు. రాహుల్‌‌‌‌  మాదిరిగా సర్జరీ నుంచి కోలుకున్న మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌  సెప్టెంబర్‌‌‌‌ 2న పాకిస్తాన్‌‌‌‌తో పోరులో బరిలోకి దిగే చాన్సుంది. ఎన్‌‌‌‌సీఏలో  ముమ్మరంగా ప్రాక్టీస్‌‌‌‌ చేస్తున్నప్పటికీ.. రియల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ స్టిమ్యులేషన్‌‌‌‌కు తను రెడీగా ఉన్నాడో లేదో తెలియాల్సి ఉంది. అలాగే, గాయాల నుంచి కోలుకొని ఐర్లాండ్‌‌‌‌తో టీ20లో  రీఎంట్రీ ఇచ్చిన పేసర్లు బుమ్రా, ప్రసిధ్‌‌‌‌ కృష్ణ వన్డేలో ఎలా ఆడతారనే దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

పాక్‌‌‌‌ బలంగా..

మెగా టోర్నీలో  మెయిన్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇండియానే అయినప్పటికీ  డిఫెండింగ్‌‌‌‌ చాంప్‌‌‌‌ శ్రీలంక, పాక్​తో పాటు అఫ్గాన్‌‌‌‌, బంగ్లా కూడా సత్తా చాట చూపెట్టాలని ఆశిస్తున్నాయి. ఆతిథ్య జట్టే అయినప్పటికీ పాక్‌‌‌‌లో కేవలం ఆరు మ్యాచ్‌‌‌‌లే జరుగుతున్నాయి. ఎక్కువ మ్యాచ్‌‌‌‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న  లంక సొంత గడ్డపై ట్రోఫీ నిలబెట్టుకోవాలని కోరుకుంటోంది. అయితే,  కీలక ఆటగాళ్లు దుష్మంత చమీర, హసరంగ, లాహిరు కుమార, మధుషంక గాయాలతో పూర్తి జట్టును బరిలోకి దింపేందుకు లంక ఇబ్బంది పడుతోంది. బంగ్లా పరిస్థితి కూడా ఇలానే ఉంది. తమీమ్‌‌‌‌ ఇక్బాల్‌‌‌‌, ఎబాదట్‌‌‌‌ గాయాల వల్ల టోర్నీ నుంచి వైదొలిగారు. అన్నింటిలో  పాకిస్తాన్‌‌‌‌ టీమ్‌‌‌‌ బలంగా కనిపిస్తోంది. ఇటీవలే మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో అఫ్గాన్‌‌‌‌ను వైట్​వాష్​ చేసిన బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ కెప్టెన్సీలో వన్డేల్లో టాప్​  ర్యాంక్‌‌‌‌ అందుకొని జోష్‌‌‌‌లో ఉంది. వన్డే సిరీస్‌‌‌‌లో ఓటమికి పాక్‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అఫ్గాన్ ఆశిస్తోంది. 

ఫార్మాట్‌‌‌‌ ఇలా

ఈ టోర్నీలో ఇండియా, పాక్‌‌‌‌, నేపాల్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–ఎలో.. లంక, అఫ్గాన్‌‌‌‌, బంగ్లా గ్రూప్‌‌‌‌–బిలో ఉన్నాయి. గ్రూప్‌‌‌‌లో ఒక్కో జట్టు మిగతా రెండింటితో  పోటీ పడుతుంది. రెండు గ్రూప్‌‌‌‌ల్లో టాప్‌‌‌‌2జట్లు సూపర్‌‌‌‌4కు క్వాలిఫై అవుతాయి. సూపర్‌‌‌‌4లో ప్రతీ టీమ్‌‌‌‌ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌‌‌‌ ఆడుతుంది. టాప్‌‌‌‌2 టీమ్స్‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌ 17న కొలంబోలో ఫైనల్లో తలపడతాయి. గ్రూప్​లో  సెప్టెంబర్​2, సూపర్​4లో 10న ఇండియా–పాక్​తలపడతాయి.ఫైనల్​ చేరితో మూడోసారి ఢీకొడతాయి. 

లంక టీమ్‌‌‌‌లోకి బినుర, మదుషన్​, హేమంత

టోర్నీకి ఒక్క రోజు ముందు లంక తమ జట్టును ప్రకటించింది. సీమర్లు బినుర ఫెర్నాండో, ప్రమోద్‌‌‌‌ మదుషన్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ దుషాన్‌‌‌‌ హేమంత వన్డే టీమ్‌‌‌‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. వెటరన్స్‌‌‌‌ ఏంజెలో మాథ్యూస్‌‌‌‌, దినేశ్‌‌‌‌ చండిమల్‌‌‌‌కు ప్లేస్‌‌‌‌ దక్కలేదు. లంక టీమ్‌‌: షనక (కెప్టెన్), నిశాంక, కరుణరత్నే, కుశాల్ మెండిస్ (కీపర్‌‌), కుశాల్ పెరీరా (కీపర్‌‌), ధనంజయ డి సిల్వా, అసలంక, సదీర (కీపర్‌‌),  తీక్షణ, పతిరణ, కసున్ రజిత,  దుషాన్ హేమంత,  బినుర ఫెర్నాండో, ప్రమోద్‌‌ మదుషన్‌‌.