Asia cup 2023: ప‌సికూన‌ జట్టుపై పాకిస్తాన్ భారీ విజయం

Asia cup 2023: ప‌సికూన‌ జట్టుపై పాకిస్తాన్ భారీ విజయం

ఆసియా క‌ప్ 2023 పోరును ఆతిథ్య పాకిస్తాన్ జట్టు ఘనంగా ఆరంభించింది. నేపాల్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 238 ప‌రుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత పాక్ 342 పరుగుల భారీ స్కోర్ చేయగా.. లక్ష్యచేధనలో నేపాల్ జట్టు 104 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బాబ‌ర్ ఆజం(151 : 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్ అహ్మ‌ద్(109 నాటౌట్ :  71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. దీంతో ఆతిథ్య జ‌ట్టు నేపాల్ ముందు కొండంత ల‌క్ష్యాన్ని ఉంచింది. నేపాల్ బౌల‌ర్ల‌లో సోంప‌ల్ క‌మీ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నేపాల్ బ్యాటర్లు.. 23.4 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించారు. 104 పరుగుల వద్ద నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీసుకోగా.. షాహీన్ ఆఫ్రిది 2, హారిస్ రౌఫ్ 2, నసీం షా 1, మహ్మద్ నవాజ్ ఒక వికెట్ తీసుకున్నారు.