
ఆసియా కప్ 2025 మంగళవారం (సెప్టెంబర్ 9) ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 94 పరుగుల తేడాతో హాంగ్ కాంగ్ పై బిగ్ విక్టరీ కొట్టింది. నేడు (సెప్టెంబర్ 10) ఇండియా, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం కష్టం కాకపోవచ్చు. షెడ్యూల్ సంగతి పక్కన పెడితే ఈ సారి ఆసియా కప్ లో తొలిసారి ఎనిమిది జట్లు తలపడుతున్నాయి. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి.
సెమీస్ పోరు లేదు:
ఆసియా కప్ లో తొలిసారి 8 జట్లు ఆడుతుండడంతో సెమీస్ ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా సెమీస్ పోరు లేదు. గ్రూప్ దశలో ప్రతీ జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతీ గ్రూప్ లో టాప్-2లో నిలిచిన జట్టు సూపర్ 4 రౌండ్ కు క్వాలిఫై అవుతాయి. సూపర్-4 లో నాలుగు జట్లు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం మూడు మ్యాచ్ లు ఆడుతోంది. సూపర్-4 లో టాప్-2 లో నిలిచిన టీమ్స్ ఈ నెల 28న ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్ దశ, సూపర్-4, ఫైనల్ మ్యాచ్ లు మాత్రమే ఉంటాయి.
ఇండియాకు తిరుగులేదు:
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని ఇండియా తిరుగులేని ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మిగిలిన ఏడు జట్లకు, ఇండియాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే 'ఫేవరెట్' అనే పదం కూడా చిన్నదే అవుతుంది. అయితే, ఈ ఆధిపత్యమే కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన ఇండియా తొమ్మిదో టైటిల్ గెలిస్తే అది పెద్ద ఘనత కాబోదు. కానీ పొరపాటున ఓడితే మాత్రం విమర్శల జడివాన కురవడం ఖాయం. మరో ఐదు నెలల్లో టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, ఈ టోర్నీ ఫలితం జట్టు ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
►ALSO READ | Asia Cup 2025: యూఏఈతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ప్లేయింగ్ 11 నుంచి అర్షదీప్ ఔట్