ఆసియా అండర్‌–15, 17 బాక్సింగ్‌ చాంపియన్షిప్: ఇండియాకు 17 పతకాలు

ఆసియా అండర్‌–15, 17 బాక్సింగ్‌ చాంపియన్షిప్: ఇండియాకు 17 పతకాలు

తాష్కెంట్‌: ఆసియా అండర్‌–15, 17 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్ల పంచ్‌ అదిరింది. రెండు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో మొత్తం 17 పతకాలు సాధించారు. బాలికల 46 కేజీల ఫైనల్లో రాఖీ ఆర్‌ఎస్‌సీ ద్వారా రుక్షోనాబో (ఉజ్బెకిస్తాన్‌)పై, 57 కేజీల్లో నవ్య 4–0తో సారా కోనో (జపాన్‌)పై నెగ్గి స్వర్ణాలను సాధించారు. 

48 కేజీల బౌట్‌లో ఖుషీ చంద్‌ 1–4తో అరిసా యోషినగా (జపాన్‌) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 63 కేజీల్లో దియా, 70 కేజీల్లో హిమాన్షి వరుసగా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మెహ్రిమాఖ్‌ కిలిచోవా, కరీనా ఇల్మురవా చేతుల్లో 0–5 తేడాతో ఓడి రజతంతో సంతృప్తి పడ్డారు. 75 కేజీల విభాగంలో జ్యోతి 1–-4తో కజకిస్తాన్ బాక్సర్ డయానా నైడైరెబెక్ చేతిలో, 80 కేజీల విభాగంలో వంశిక 0–-5తో జాన్సయ యెర్ఘాన్‌ (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. 

80+ కేజీల్లో గుర్సీరత్ కౌర్ చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ 2-–3తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సోహిబాఖోన్ ఖుదోయ్‌బెర్డీవా చేతిలో స్వల్ప తేడాతో ఓడి రజతాన్ని కైవసం చేసుకుంది.